సినీ పరిశ్రమ విచిత్రమైనది. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే గుమ్మడికాయంత టాలెంట్ తో పాటు అవగింజంత అదృష్టం కావాలి. అంతేకాదు కొన్ని సార్లు ఎవరి కోసమో అనుకున్న కథలు.. ఏటేటో తిరిగి వేరే హీరో దగ్గరికి వస్తాయి. సినిమా రిలీజై.. సూపర్ హిట్ అయిన తర్వాత ఏదో సందర్భంలో ఇందుకు సంబంధించిన వివరాలు బయటకు వస్తాయి. అలాంటి ఉదంతాలు ఇండస్ట్రీలో కోకొల్లలు. ఇలాంటి వాటిలోనే ఒకటి ‘‘అల్లరి ప్రేమికుడు’’. దర్శకేంద్రుడు కే . రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగపతి బాబు సరసన సౌందర్య, రంభ నటించారు.
అయితే ఈ సినిమాలో తొలుత హీరోగా అనుకుంది యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కోసం. అంతేకాదు హీరోయిన్లుగా దివ్యభారతి, మీనాలు ఉండాలని ముందే ఫిక్సయ్యారు. మరి ఇలాంటి ప్రాజెక్ట్ లో మొత్తం నటీనటులు మారిపోవడానికి చాలా రీజన్లే వున్నాయి. ఒకసారి గతంలోకి వెళితే.. రచయితగా దూసుకెళ్తున్న సత్యానంద్ నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వ్యాపారవేత్త సురేశ్‌తో కలిసి ఓ సినిమా తీయాలనుకున్నారు. ఇందుకు కథ చర్చలు కూడా ముగిశాయి. అంతా అనుకున్నట్లుగా జరుగుతుండగా.. దివ్యభారతి ఆకస్మిక మరణం తో మొత్తం సీన్ మారిపోయింది.
అటు వరుస బ్లాక్ బస్టర్ లతో పాటు దక్షిణాదిలోని నాలుగు భాషల్లో బిజీగా ఉండటంతో మీనా డేట్స్ కూడా దొరకలేదు. దీంతో సౌందర్య, రంభలను హీరోయిన్లుగా తీసుకున్నారు. దీంతో కథను కూడా మార్చాల్సి వచ్చింది. దీంతో మూడో హీరోయిన్ అవసరం పడింది. ఇందుకోసం కాంచన్ ను ఎంపిక చేశారు. మొత్తం సెట్ అయిన తర్వాత హీరో దగ్గర సమస్య వచ్చి పడింది. ముగ్గురు హీరోయిన్లతో లవ్ ట్రాక్ ను కమల్‌తో కంటే అప్పటికే ఫ్యామిలీ హీరోగా, లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న జగపతి బాబు అయితే బాగుంటుందని రాఘవేంద్రరావు ఫిక్సయ్యారు.
అలా.. 1993 డిసెంబర్ 31న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అల్లరి ప్రేమికుడు’ ఓపెనింగ్ జరిగింది. ముగ్గురు హీరోయిన్లకు తోడు రమ్యకృష్ణ గెస్ట్ రోల్ లో నటించి మెప్పించారు. అయితే ఇంతటి భారీ స్టార్ క్యాస్టింగ్ తో, బడ్జెట్ తో రూపొందిన ‘అల్లరి ప్రేమికుడి’ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. కాకపోతే… ఈ సినిమాలోని పాటలు మాత్రం ఇప్పటికే ఎవర్ గ్రీనే.