వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా ఇది నిజమే.! నాగార్జున- గోపీచంద్ లతో రామాయణాన్ని తెరకెక్కించాలి అని ఓ దర్శకుడు అనుకున్నాడట. నాగార్జునని రావణాసురుడిగా, గోపీచంద్ ను రాముడిగా పెట్టి.. ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దాలి అని ఓ స్టార్ డైరెక్టర్ కలలు కన్నాడు. ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. ఇందులో సీత పాత్రకు అనుష్కని కూడా ఫైనల్ చేశాడట. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేయాలనుకున్న దర్శకుడు మరెవరో కాదు రాంగోపాల్ వర్మ.
సరిగ్గా 11 ఏళ్ళ క్రితం బాలకృష్ణ- నయనతార కాంబినేషన్లో ‘శ్రీరామరాజ్యం’ అనే చిత్రం వచ్చింది. బాపు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. కమర్షియల్ గా కూడా ఈ మూవీ పర్వాలేదు అనిపించుకుంది. ఈ చిత్రంలో సీతగా నయనతార అద్భుతంగా నటించింది. అప్పటివరకు గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చిన ఆమె ఇలాంటి పాత్ర.. అంత బాగా చేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. ఆ టైంలో తన స్టైల్ లో ‘రామాయణం’ తీస్తానని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు.
ఆయన షూటింగ్ కంప్లీట్ చేసిన సినిమాలను, వెబ్ సిరీస్ లనే సరిగ్గా రిలీజ్ చేయలేదు. ఇక నోటి మాటగా చెప్పిన ఆ ప్రాజెక్టుని తీస్తాడా చెప్పండి. అయితే 11 ఏళ్ళు అయ్యాక ఆ ప్రాజెక్టు గురించిన ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందా అని మీకు డౌట్ రావచ్చు. ఈ మధ్యనే ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అయ్యింది. అందులో రాముడిగా ప్రభాస్ ఓకే కానీ, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడు పాత్రలో సన్నీ సింగ్ సూట్ అవ్వలేదు అని కొందరి అభిప్రాయం.
అందుకే రాంగోపాల్ వర్మ చెప్పిన ‘రామాయణం’ చేసి ఉంటే బాగుణ్ణు.. అప్పుడు క్యాస్టింగ్ సెలక్షన్ అంటే ఏంటో బాలీవుడ్ జనాలకు తెలిసుండేది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆదిపురుష్ టీజర్ కు కూడా మిక్స్డ్ రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే. అయితే యూట్యూబ్ లో ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.