అల్లు ఫ్యామిలీని తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన నటుడు అల్లు రామలింగయ్య. టాలీవుడ్ లో దిగ్గజ స్థాయి ఉన్న లెజెండ్స్ లో ఒకడు అల్లు రామలింగయ్య. అప్పట్లో ఈయన కామెడీ ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించేది, అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హాస్య రసాన్ని పరిచయం చేసిన ఇద్దరు ముగ్గురు మహానుభావులలో ఒకడు అల్లు రామలింగయ్య గారు. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చారు.
ఆయన నటనని అనుసరించి వాళ్ళు కూడా హాస్యాన్ని పండించే ప్రయత్నం చేసారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది విఫలం అయ్యారు కానీ, అల్లు రామలింగయ్య స్థానానికి మాత్రం ఎవ్వరూ చేరుకోలేకపోయారు. ఆయన కేవలం హాస్యం మాత్రమే కాదు సెంటిమెంట్ ని కూడా అద్భుతంగా పండించగలరు. కొన్ని సినిమాల్లో విలనిజం తో కూడిన కామెడీ ని కూడా ఆయన చేసాడు, అలా ఎన్నో వందల సినిమాల్లో నటించిన అల్లు రామలింగయ్య కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.
ప్రేక్షకుడిని నటుడు ఎంతలా కదిలించగలిగితే అంత గొప్ప నటుడు అని అందరూ అంటూ ఉంటారు.కొంతమంది విలన్స్ బయట కనిపిస్తే జనాలు తిట్టడం, కొట్టడం వంటివి కూడా జరిగాయి. కొత్త శ్రీనివాస రావు మరియు తనికెళ్ళ భరణి వంటి వారు పలు ఇంటర్వ్యూస్ లో తాము పోషించిన పాత్రలకు జనాల నుండి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో చెప్పుకున్నారు. అలా అల్లు రామలింగయ్య కి కూడా అనుభవం అయ్యింది అట. ఒక సినిమాలో ఆయన అనాధాశ్రమం కి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న పిల్లలకు ఇన్క్ ఫిల్లర్ లో పాలుని నింపి అందరి నోట్లో ఒక్కో చుక్క పోస్తాడు.
ఈ సీన్ చూసినప్పుడు (Allu Ramalingaiah) అల్లు రామలింగయ్య మీద అప్పట్లో జనాలకు ఎంతో కోపం వచ్చిందట. ఒకరోజు ఆయన జనాల్లోకి వచ్చినప్పుడు వెనుక నుండి ఎవరో ఆయనని చెప్పులతో కొట్టాడట, అల్లు రామలింగయ్య దానికి సీరియస్ కాకుండా, ఆ చెప్పుని తన ఇంటికి తీసుకెళ్లి తనకి వచ్చిన అవార్డ్స్ మధ్యలో పెట్టాడట. ప్రేక్షకుడిని నేను అంతలా నా నటనతో ప్రభావితం చేశాను, ఇంతకు మించిన అవార్డు ఏమి ఉంటుంది అని అడిగిన వాళ్లకు చెప్పేవాడట.