జూనియర్ చిరంజీవిగా పాపులర్ అయిన రాజ్ కుమార్ అందరికీ గుర్తుండే ఉంటాడు.బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ లో అతను హీరోగా నటించాడు. ఇతని గ్లామర్ చూసో ఏమో కానీ.. ఇతనికి సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా ఇంటిమేట్ సీన్స్ పెట్టేవారు. సరే ఇప్పుడైతే కనుమరుగు అయిపోయాడు లెండి. అందుకు కారణం.. తాను నిర్మాతగా మారి సినిమాలు తీయడమే అని అంటున్నాడు రాజ్ కుమార్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ వల్ల ఇతను రూ.3 కోట్ల వరకు పోగొట్టుకున్నాడట.
ఇటీవల అతను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. (Rajkumar) రాజ్ కుమార్ మాట్లాడుతూ.. “నేను నిర్మాతగా మారి బారిస్టర్ శంకర్ నారాయణ’ అనే సినిమా తీశాను. అది ఓ తమిళ సినిమాకి రీమేక్. నేనే నటించి, నిర్మించిన సినిమా అది. చిన్న నిర్మాతనే అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు కూడా సాయం చేశారు. నా సినిమాకి థియేట్రికల్ రిలీజ్ బాగా ప్లాన్ చేశాను.2013 లో సెప్టెంబర్ 21న ఆ సినిమాని రిలీజ్ చేశాం.
అయితే అక్టోబర్ 12 తర్వాత పవన్ కళ్యాణ్ గారి ‘అత్తారింటికి దారేది’ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. మా సినిమాకి స్పేస్ ఉండనే ధైర్యంతోనే సెప్టెంబర్ 21 న రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఊహించని విధంగా ‘అత్తారింటికి దారేది’ సినిమా ఎడిటింగ్ రూం నుండి సగం పైనే లీక్ అయ్యింది.దీంతో సడన్ గా సెప్టెంబర్ 27నే ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.అప్పుడు నా సినిమాని చాలా థియేటర్ల నుండి తీసేసారు.
ఫైనల్ గా నా సినిమాకి కేవలం 17 థియేటర్లు మాత్రమే మిగిలాయి. రెండు వారాలు అయ్యాక అవి కూడా లేవు. దీంతో నాకు రూ. 3 కోట్లు నష్టం వచ్చింది. అదే డబ్బుని నేను రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టి ఉంటే కనుక ఇప్పుడు దాని విలువ రూ.30 కోట్లు అయ్యేది. నా జీవితంలో నేను చేసిన తప్పు ఇదే” అంటూ చెప్పుకొచ్చాడు.