మార్కెటింగ్ అనేది ఓ పెద్ద బ్రహ్మపదార్థం. అందులోని లింక్‌లు తెలియకపోతే, వాటి వెనుక మతలబులు అర్థం చేసుకోకపోతే ఇబ్బందులు పడతాం. అయితే ఇవన్నీ తెలిసి కూడా ఒకరు తప్పు చేస్తే ఏమనాలి. ఇప్పుడు మహేష్‌బాబు తీసుకున్న నిర్ణయం కూడా అలానే అనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఎక్కువగా ప్రకటనలు చేసే హీరో, వాటి వల్ల ఎక్కువగా డబ్బులు సంపాదించే హీరో.. ఎవరు అంటే మహేష్ అనే చెప్పాలి. ఈ క్రమంలో మహేష్ పప్పులో కాలేశాడా? కొత్త ప్రకటన చూస్తే అదే అనిపిస్తోంది.
మహేష్‌బాబు, టైగర్ ష్రాఫ్ కలసి ఇటీవల ఓ ప్రకటనలో కలసి నటించారు. అదే పాన్ బహార్ మౌత్ ఫ్రెష్‌నర్. అందులో తప్పేముంది, పప్పులో కాలేసేది ఏముంది అనేగా మా ఆలోచన. పాన్ బహార్ అంటే పాన్ మసాలాలకు ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. ఇప్పుడ మౌత్ ఫ్రెష్‌నర్ ప్రకటనే చేసుండొచ్చు కానీ… పరోక్షంగా పాన్ మసాలాలకు ప్రచారం చేసినట్లే కదా. ప్రచార రంగంలో ఈ ఫార్ములాను చాలా సంస్థలు వాడుతున్నాయి. అలా మహేష్… ప్రమాదకర పాన్ మసాలా సంస్థకు ప్రచారం చేసినట్లయింది.
ఇంకా సులభంగా అర్థమవ్వాలంటే… రాయల్ చాలెంజ్ యాడ్ చూడండి. ముందంతా అదేంటే చూపిచకుండా, ఆఖరులో మినరల్ వాటర్ అంటారు. పరోక్షంగా వాళ్లు ప్రచారం చేసది మద్యం అని మార్కెట్ నిపుణులు అంటుంటారు. మాణిక్ చంద్ అనే సంస్థ కూడా ఇలానే చేస్తుంటుంది. ఇంపీరియల్ బ్లూ కూడా ఇదే పని. ఇప్పుడు అర్థమైందా… మహేష్‌బాబు చేసిన పనేంటో. గతంలోనే పాన్ బహార్ జేమ్స్ బాండ్ హీరోగా ప్రసిద్ధి చెందిన పియర్స్ బ్రాస్నన్‌తో ఒప్పందం చేసుకుంది. ఆయన యాడ్‌లో నటించారు కూడా.
ఈ క్రమంలో బ్రాస్నన్‌పై విమర్శలు రావడంతో ఒప్పందాన్ని సమీక్షించుకున్నారు. తనను పాన్ బహార్ కంపెనీ మోసం చేసిందని, మౌత్ ఫ్రెష్‌నర్ పేరుతో పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారని గుర్తించానని బ్రాస్నన్ చెప్పారు. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు కూడా ఇలాంటి పనేమైనా చేస్తారా అనేది వేచి చూడాలి.