ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai).. ఒకప్పటి కుర్రాళ్ల కలల దేవత. ప్రపంచ సుందరి అయి.. ఆ తర్వాత సినిమాల్లో స్టార్ హీరోయిన్ అయ్యాక ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అనేలా అలరించింది. అందుకే ఆమె ఎక్కడికెళ్లినా ఆమెతో ఫొటోలు దిగడానికి అభిమానులు ఆశపడుతుంటారు. ఇప్పటికీ ఆమెకు అదే ఫాలోయింగ్ ఉంది. మొన్నీమధ్యనే ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) టైమ్‌లో చూశాం. అయితే ఆమె ఓ నటుడితో సెల్ఫీ దిగింది అంటే నమ్ముతారా? అవును, ఆమె ఎంతో ముచ్చటపడి తన కుమార్తెతో కలసి ఆ నటుడితో సెల్ఫీ దిగింది.

ఆయనే ప్రముఖ నటుడు బ్రహ్మానందం (Brahmanandam) . భారతీయ సినిమా పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక దీనికి వేదిక అయింది. అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు వివిధ సినిమా పరిశ్రమలకు చెందిన నటులు హాజరయ్యారు. అలా ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) , బ్రహ్మానందం కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు కలసి.. బ్రహ్మానందంతో సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ ఫొటో చూసి ఆమెతో అందరూ సెల్ఫీ దిగాలి అనుకుంటే.. ఆమె మాత్రం బ్రహ్మాతో ఫొటో దిగింది.. అదీ ఆయన రేంజు అంటూ సంబరపడుతున్నారు. ఇక ఈ అవార్డుల వేడుకలో బ్రహ్మానందానికి ఐఫా అవార్డు వచ్చింది. ‘రంగమార్తండ’ (Rangamaarthaanda) సినిమాలో చక్రపాణి పాత్రలో నటనకుగాను ఆయనకు ఈ పురస్కారం ఇచ్చారు. పురస్కారం అందుకున్న తర్వాత బ్రహ్మానందం మాట్లాడుతూ దీనికి కారణం దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) అని ఆయనను మెచ్చుకున్నారు.
ఆ సినిమాలో మంచి పాత్రతో ప్రేక్షకులను అలరించే అవకాశం రావడం మరచిపోలేని అనుభూతి అని కూడా చెప్పుకొచ్చారు. గత ఏడాది వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా ఆశించిన ఫలితం అందుకోకపోయినా.. ప్రశంసలు అయితే దక్కించుకుంది.
