అక్కినేని అభిమానులు అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ కాలేదు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న ఈ సినిమా క్లిక్ అయితే తమ హీరోలు మాస్ లో కోల్పోయిన పట్టుని తిరిగి సాధించుకునే అవకాశాలు ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.
ఆయన క్లైమాక్స్ ఎపిసోడ్ ని రెండు వెర్షన్స్ గా తీస్తున్నారట. ఫైనల్ గా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఏ వెర్షన్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తుందో దాన్ని యాడ్ చేస్తారట. ఇదిలా ఉండగా.. కన్నడ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది. ‘కేజీఎఫ్’, ‘కాంతారా’ సినిమాలతో సత్తా చాటింది. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ అఖిల్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోయినా.. చర్చలైతే జరిగాయని తెలుస్తోంది.
డైరెక్టర్ సెట్ అయిన తరువాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఫ్యూచర్ లో మూడు వేల కోట్లతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా అఖిల్ సినిమా కూడా తీయబోతున్నారు. అయితే డైరెక్టర్ ఎవరనేది కీలకం. ప్రస్తుతానికైతే పెద్ద డైరెక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు. మరి హోంబలే ఫిలిమ్స్ దర్శకుడిగా ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. మొత్తానికి అఖిల్ ప్లానింగ్ బాగానే ఉంది కానీ జోరు పెంచాల్సిన అవసరం ఉంది.
ఒకవైపు తన తోటి హీరోలు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అఖిల్ అన్నయ్య నాగచైతన్య మాస్ సినిమాలు చేసి వర్కవుట్ కాకపోవడంతో.. కొత్త ప్రయోగాలకు రెడీ అవుతున్నారు. నాగార్జున సైతం ‘వైల్డ్ డాగ్’, ‘ది ఘోస్ట్’ సినిమా ప్లాప్ లతో డీలా పడ్డారు. ఇలాంటి సమయంలో కమర్షియల్ మార్కెట్ మీద పట్టు సాధించాలంటే అఖిల్ ఫోకస్ పెంచాలి. అతడిపై పెద్ద బాధ్యతే ఉంది. మరి ఈ సవాల్ ని అఖిల్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి!