మీడియా సెలబ్రిటీల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. విజయం సాధించినప్పుడు డప్పు కొట్టినట్టే.. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక షోలతో పాఠకుల, వీక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. రీసెంట్ గా నటి శ్రీదేవి మరణం విషయంలో అయితే హద్దులు మీరి ప్రవర్తించింది. బాత్రూమ్ జర్నలిజమాన్ని తెరపైకి తెచ్చిన ఆ ఛానల్స్ ను ప్రజలు ఛీ కొట్టారు. శ్రీదేవి చివరి క్షణాలను మీడియా సొమ్ములకోసం దిగజారిందని అసహ్యించుకున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున భార్య అమల కూడా మీడియా వైఖరిని తప్పుబట్టారు. తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా మీడియాకు ఓ ఘాటు లేఖ రాశారు. ”నేను ఎలా కనిపిస్తున్నానో, ఎంత బరువు పెరిగానో కామెంట్ చేయకుండా వయసు మీదపడడాన్ని నన్ను ఆస్వాదించనిస్తారా?.. నాకు ‘జీరో సైజ్’ లేదు అనే ఆత్మన్యూనతా భావానికి లోనవకుండా బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఇస్తారా?.. ఇప్పటి నా పొట్టి జట్టును, 19 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నా పొడవాటి జట్టుతో పోల్చకుండా, నా జుట్టుకు నల్లరంగు వేసుకునే అవసరం లేకుండా చేస్తారా? నా తలపై జట్టును తప్ప నాలోని జ్ఞానాన్ని గుర్తించలేరా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అంతటితో ఆగకుండా.. ” ఓ వ్యక్తి శరీరాన్నిమాత్రమే కాకుండా, మనసు లోపలి భావాలను అర్థం చేసుకోగలిగే శక్తి కూడా కెమెరాలకు ఉంది. నా వంట గురించి, పుకార్ల గురించి ప్రశ్నించకుండా నేను చెప్పే అర్థవంతమైన విషయాలను పూర్తిగా వింటారా? బాక్సాఫీస్ పిచ్చి నుంచి, కీర్తి అనే పంజరం నుంచి, పేజ్-3 నుంచి, లైక్‌లు, కామెంట్ల నుంచి నాకు విముక్తి కల్పిస్తారా? నాకు వ్యక్తిగత జీవితాన్ని, స్వేచ్ఛను ఇవ్వండి. నిజాయితీగా, మానవత్వంతో, కరుణతో, ప్రయోజనకారిగా బతికే స్వేచ్ఛను ఇవ్వండి” అని అమల ఆ లేఖలో పేర్కొన్నారు. శ్రీదేవి పేరు ప్రస్తావించకుండా మీడియాకు గట్టిగా తగిలేలా ఈ లేఖ రాశారు.