హీరో పాత్రలను వీరోచితంగా చూపిస్తుంటారు మన దర్శకులు. ఎంతమంది కొట్టినా కసికందని కండరంగండలుగా కనిపిస్తుంటారు. అవకాశం వస్తే ఆకాశాన్నే నేలకు దించేంత తోపు, తురుమ్‌ఖాన్‌లుగా చూపిస్తుంటారు. అయితే అలాంటి హీరోకు ఏదైనా ఒక అంగవైకల్యం పెట్టాలి అన్నా, చిన్నపాటి శారీరక సమస్య ఎంత ధైర్యం కావాలి అంటే.. ఠక్కున చాలానే దైర్యం కావాలి అనే సమాధానమొస్తుంది. అలాంటి పనే చేశారు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తాజా చిత్రం ‘ఎఫ్ 3’లో హీరోలు ఇలా కనిపిస్తారు.
‘ఎఫ్ 3’ సినిమాలో వెంకటేశ్‌కు రేచీకటి ఉంటుందట, ఇక వరుణ్‌తేజ్‌కి అయితే నత్తి ఉంటుందట. వినడానికి ఫన్నీగా ఉన్నా ఇలాంటి పాత్రను ఒప్పించి, చేయించి, మెప్పించడం చాలా కష్టం అని చెప్పాలి. కానీ అనిల్ రావిపూడి ఆ పని చేశారు. మరి ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి. అయితే అసలు హీరోలను అలా ఎందుకు చూపించాలని అనుకున్నారో ఆయన ఇటీవల చెప్పుకొచ్చారు. ఆ విషయాలు వింటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. చూస్తే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది అని అంటున్నారు.
స్థూలంగా అనిల్ ఆన్సర్ చెప్పాలంటే… వినోదం మోతాదు పెంచడానికే. అవును ‘ఎఫ్3’కి వచ్చేసరికి అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మామూలు పాత్రకంటే ఇలాంటి పాత్రలతో ఎక్కువగా వినోదం సృష్టించే అవకాశం ఉంటుందని ‘ఎఫ్ 3’ టీమ్‌కి అనిపించిందట. దీంతో హీరో పాత్రల్ని అలా డిజైన్ చేశారట. రాత్రివేళల్లో వచ్చే సన్నివేశాల్లో వెంకటేష్ భలే వినోదం పండిస్తారు అని చెబుతున్నారు అనిల్.
ఇక వరుణ్‌తేజ్ నత్తికి తగ్గట్టుగా మేనరిజమ్‌ని డిజైన్ చేశారట. నత్తి అడ్డుపడినప్పుడు వరుణ్‌తేజ్ ఫేమస్ హీరోల ఐకానిక్ స్టెప్పులు వేసి కవర్ చేస్తుంటాడట. దీన్ని కూడా సవాల్‌గా తీసుకొని చేశాం అన్నారు అనిల్. సుమారు 30 రకాల మేనరిజమ్స్‌తో తెరపై చూపిస్తాడట వరుణ్‌తేజ. జంధ్యాల ‘అహనా పెళ్లంట’ సినిమా ప్రేరణతో వరుణ్ పాత్రని డిజైన్ చేశానని చెప్పారు దర్శకుడు. మరి అనిల్ ప్రయత్నానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.