అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) శత జయంతిని ఘనంగా నిర్వహించడానికి అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. ఏఎన్ఆర్ @ 100 పేరుతో చేపట్టనున్న సెలబ్రేషన్స్‌లో ఆయన అభిమానుల కోసం అదిరిపోయే సినిమాలను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఒకట్రెండు కాదు ఏకంగా పది సినిమాలు ఈ నెల 20 నుంచి 22 వరకు రిలీజ్ కాబోతున్నాయి. ఈ మేరకు అక్కినేని కుటుంబం నుండి ఓ ప్రకటన వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు (ANR Centenary Celebrations) నటించిన పది ఆణిముత్యాలు లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలను థియేట్రికల్ రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.
ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్, ఎన్‌ఎఫ్డీసీ, నేషనల్ ఫిలిం ఆర్చీవ్స్ అఫ్ ఇండియా, పీవీఆర్ ఐనాక్స్‌తో కలసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 20 నుండి 22 వరకు మూడు రోజుల పాటు పది సినిమాలను స్క్రీనింగ్ చేస్తారు. రీరిలీజ్ కాబోతున్న సినిమాల్లో ‘దేవదాసు’, ‘మిస్సమ్మ’, ‘మాయా బజార్’, ‘భార్యా భర్తలు’, ‘గుండమ్మ కథ’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సుడిగుండాలు’, ‘ప్రేమ్ నగర్’, ‘ప్రేమాభిషేకం’ (Premabhishekam) ఉన్నాయి.
ఈ సినిమాలన్నీ అల్ టైం మ్యూజికల్ క్లాసిక్స్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న రీ రిలీజ్ ట్రెండ్‌లో రీసెంట్ సినిమాలే మళ్లీ తీసుకొస్తున్నారు. కానీ ఇన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాలు వస్తుండటం ఆసక్తికరం. ఏఎన్నార్ ఫెస్టివల్‌లో ప్రదర్శించే చిత్రాలకు నాగార్జున కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారట. హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా తదితర 25 ఎంపిక చేసిన ప్రాంతాలలో అక్కినేని గోల్డెన్ హిట్స్ ప్రదర్శిస్తారట.
వీటి కోసం ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యమూ ఉంటుందట. ఏఎన్నార్ (ANR Centenary Celebrations) గురించి స్టార్ట్ చేసిన ఈ ఫీట్‌ను మిగిలిన హీరోలకూ తీసుకొస్తారు అని ఆశించొచ్చు. కాబట్టి తెలుగు సినిమా అభిమానులకు ఏఎన్నార్ @ 100 కొత్త ఆలోచనను తీసుకొచ్చినట్లే అని చెప్పాలి. చూద్దాం తొలి అడుగు అక్కినేనిది, మరి రెండో అడుగు ఎవరిదో? హిందీలో అయితే ఇప్పటికే ఈ ఫీట్ చేసి చూపించారు.