సినిమా సెట్స్‌తోనూ కథను చెప్పొచ్చు తెలుసా? గతంలో చాలా సినిమాల్లో ఈ ప్రయత్నం చూసుంటారు. సినిమాలో కనిపించే ఇల్లు, ఇంటిలో గోడలు, మ్యాట్స్, గోడల రంగులు… ఇలా అన్నీ సినిమా కథలోని భాగమే. ఇవన్నీ ప్రొడక్షన్ డిజైనింగ్‌లో భాగమే. చిన్న సినిమాలకు ఈ విభాగం లెక్క ఒకలా ఉంటే… భారీ చిత్రాలకు ఇంకో లెక్కన ఉంటుంది. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న ‘రాధేశ్యామ్’లో ఈ బాధ్యతలు స్వీకరించింది ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్.
‘రాధేశ్యామ్’ సినిమా కోసం ఇటలీని హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ఆ విషయాలన్నీ రవీందర్ చెప్పుకొచ్చారు. పీరియాడిక్ సినిమాలు చేయడం మనకు కొత్త కాదు. అయితే వేరే దేశం పీరియడ్ సినిమాను మన దేశంలో చేయడం ఇదే తొలిసారి. మదర్ ఆఫ్ ఆర్ట్‌గా పిలిచే రోమా నగరాన్ని ప్రతిబింబించే వాతావరణాన్ని ‘రాధే శ్యామ్’ సినిమా కోసం హైదరాబాద్‌ఓ సృష్టించారు. 1970 నేపథ్యంలో చేద్దామన్నప్పుడు ఆర్ట్ డైరక్టర్ రవీందర్‌కు ఆత్రుతగా అనిపించిందట. విదేశీ నేపథ్యమనేసరికి ఛాలెంజింగ్‌గా తీసుకున్నారట.
సినిమా కోసం ఇళ్లు, రైళ్లు, ఆస్పత్రులు ఇలా చాలానే సృష్టించారట. ఈ క్రమంలో ఏదీ సెట్‌లాగా అనిపించదట. పతాక సన్నివేశాల్లో వచ్చే నౌక గురించి చాలా చర్చలే జరిగాయట. నౌకను ఎలా రూపొందిస్తాం, అసలు చేయగలమా అని అనుకున్నారట. అయితే రవీందర్ మాత్రం చేయొచ్చు అనే నమ్మకంతో ఉన్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలోనూ అలాంటి సెట్స్ వేయొచ్చని అనుకున్నారట. దానికి అవసరమయ్యే టెక్నాలజీ, సదుపాయాలు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉన్నాయని ఆయన చెప్పారట. దాని కోసం ఓ నాలుగు ఫ్లోర్లు తీసుకుని, 432 అడుగుల నౌక సెట్ వేశారట.
ఆ షూటింగ్ ఫ్లోర్లలో నౌక, కాబిన్స్, హైడ్రాలిక్ సిస్టమ్స్… ఇలా మొత్తంగా షిప్ వాతావరణాన్ని క్రియేట్ చేశారట. ఈ సీన్స్ షూటింగ్ చేసేటప్పుడు హాలీవుడ్ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్టే అనిపించేదట. సినిమా సెట్స్ కోసం రవీందర్ బృందం ఏడాదిపాటు రోమా నగరంలోనే ఉందట. 16 మంది ప్రొడక్షన్ డిజైనర్ బృందం, 20 మంది ఇటాలియన్ బృందం కలసి ఈ సినిమా లొకేషన్ల కోసం వెతికారట. ఇటలీలో ఏ ఇంటికి వెళ్లినా ఇది 700 ఏళ్ల ఇల్లు, 2000 ఏళ్ల కిందట నిర్మించిన కట్టడం అని చెప్పేవాళ్లట. అలా అక్కడ తిరిగి తిరిగి అవగాహన తెచ్చుకుని ఇక్కడ సెట్స్ వేశారట.