తీసిన సినిమానే మళ్లీ తీయడం అంటే ఈజీనా కాదా అనే చర్చ చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాం. ఎందుకంటే రీమేక్ అనేది రెండువైపులా వాడి ఉన్న కత్తి కాబట్టి. అయితే ఇలాంటి సినిమాలను ‘స్ఫూర్తి పొందారు’ అనే తరహాలో వరుసగా చేస్తుంటారు ప్రముఖ దర్శకుడు అట్లీ. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల్లో చాలా వరకు గతంలో దేశంలో వచ్చిన సినిమాల ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. మొత్తంగా ఆ సీన్, ఆ కాన్సెప్ట్ కాకపోయినా అలానే ఉంటాయి.
అలా ఆయన చేసిన ఓ సినిమా (Theri) ‘తెరి’. తమిళంలో భారీ విజయం అందుకున్న ఈ సినిమా తెలుగులో ‘పోలీసు’గా వచ్చింది. అంతేకాదు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో పవన్ కల్యాణ్ మళ్లీ చేస్తున్నారు కూడా. అంతేకాదు ఈ సినిమా హిందీలోకి కూడా వెళ్లింది. వెళ్లడం కాదు… వేగంగా షూటింగ్ కూడా జరుపుకుంటోంది. దీంతో ఇక్కడ పవన్ ఆపేశాడు కానీ, అక్కడ హిందీలో వరుణ్ ధావన్ మాత్రం శరవేగంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే డిస్కషన్ పాయింట్.
రాజకీయం, సినిమాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తూ వచ్చిన పవన్… ఇప్పుడు కేవలం రాజకీయం పడవ మీదకు వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన మొత్తంగా పొలిటికల్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో సెట్స్ మీదున్న సినిమాలు ఆగిపోయాయి. అందులో ‘తెరి’ రీమేక్ కూడా ఒకటి. కానీ హిందీలో వరుణ్ ధావన్ ఈ సినిమాను త్వరలో పూర్తి చేయాలి అనుకుంటున్నాడట. అట్లీ నిర్మాతగా అతని స్నేహితుడు కలీస్ దర్శకుడిగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌నే తీసుకున్నారట. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కంటే ముందే హిందీ ‘తెరి’ వచ్చేస్తుంది అని అంటున్నారు. అదే జరిగితే రెండు తెరకెక్కిన సినిమాను పవన్ రీమేక్ చేస్తున్నట్లు లెక్క. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మొత్తంగా ‘తెరి’ కథను చూపించడం లేదు అని టాక్. ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే ఆ సినిమాది, బ్యాగ్రౌండ్ కొత్తగా ఉంటుంది అని అంటున్నారు.