భాషా బేధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకొన్న ఏకైక మూవీ సిరీస్ “ఎవెంజర్స్”. గగుర్పాటుకు గురి చేసే యాక్షన్ సీన్స్ తో, లెక్కకు మిక్కిలి సూపర్ హీరోస్ తో అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ మోస్ట్ సక్సెస్ ఫుల్ సెరీస్ గా పేరొందిన ఈ సిరీస్ లో వచ్చిన తాజా చిత్రం “ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్”. దాదాపు మార్వెల్ స్టూడియోస్ హీరోస్ అందరూ నటించిన ఈ చిత్రంపై ట్రైలర్ విడుదలైనప్పట్నుంచి విపరీతమైన క్రేజ్ సంపాదించుకొన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ (ఏప్రిల్ 27) విడుదలైంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం మన ఇండియన్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ : బేసిగ్గా ఈ స్టోరీ అర్ధమవ్వాలంటే.. ఎవెంజర్స్ సిరీస్ కి సంబంధించిన అన్నీ పార్ట్శ్ చూసి లేదా కనీసం క్యారెక్టర్స్ తెలిసి ఉండాలి అనుకొనేవారికి కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అర్ధమయ్యే మొట్టమొదటి సూపర్ హీరోస్ మూవీ “ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్”. ఒక్క “యాంట్ మేన్, హాక్ ఐ” మినహా దాదాపుగా మర్వెల్ హీరోస్ అందరూ నటించిన ఈ చిత్రంలో ఏకైక విలన్ తానోస్. అతడు ఇన్ఫినిటీ స్టోన్స్ లో చేజిక్కించుకోవడానికి ప్రయత్నించడం, సదరు స్టోన్స్ కి కాపలా ఉన్న ఎవెంజర్స్ అడ్డుకోవడం కంటే కూడా సదరు స్టోన్స్ ను సంపాదించే ప్రయత్నంలో తానోస్ పడే వేదన, అతని ఆలోచనా ధోరణి ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకొంటాయి. ఈ సినిమాకి సంబంధించి ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పినా సినిమాలోని కీలకాంశాలు లీక్ చేసినట్లవుతుంది.
నటీనటుల పనితీరు : దాదాపుగా సినిమాలో నటించిన అందరూ ప్రేక్షకులకి పరిచయస్తులే అందువల్ల ఎవరి నటన గురించీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, థోర్ పాత్రలకి ఇచ్చిన అప్గ్రేడ్స్ మాత్రం వేరే లెవల్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఒక సూపర్ హీరో సిరీస్ ను విలన్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించడం అనేది ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అలాగే.. విలన్ క్యారెక్టరైజేషన్ తోనే ప్రేక్షకుల్ని రెండున్నర గంటలపాటు మాత్రమే కాక ఎండ్ క్రెడిట్స్ అయిపోయాక కూడా థియేటర్ లోనే కూర్చోబెట్టడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం.
తెలుగు వెర్షన్ లో తానోస్ పాత్రకి రాణా డబ్బింగ్ బాగా యాప్ట్ అయ్యింది. పైగా ఆ పాత్ర స్వభావం రాణా వాయిస్ వల్ల ప్రేక్షకులకి ఇంకాస్త బాగా రీచ్ అయ్యిందని కూడా చెప్పొచ్చు.
సాంకేతికవర్గం పనితీరు : “మార్వెల్ సినిమా” వారి సాంకేతిక నైపుణ్యం గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరమే. ఎందుకంటే సినిమా సినిమాకీ వారి సాంకేతిక పరిజ్ణానమ్ అనేది పెరుగుతూ ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేస్తుందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. పైగా.. ఈ సినిమాలో ప్రతి పాత్రను అప్గ్రేడ్ చేసిన విధానం, ప్రతి పాత్రకి ఫ్యాన్ మూమెంట్ క్రియేట్ చేసిన తీరు గురించి ఎన్నిసార్లు, ఎంత చెప్పుకున్నా తక్కువే.
అందుకే డైరెక్ట్ గా దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్ గురించి చెప్పుకోవాలి. వాళ్ళు కథను రాసుకొన్న విధానం కంటే, కథనాన్ని నడిపించిన తీరు ప్రశంసనీయం. ఒక విలన్ పాత్రతో కూడా ఎమోషన్ పండించవచ్చు అనే విషయాన్ని అద్భుతంగా ప్రూవ్ చేశారు. సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్క వీక్ మూమెంట్ కూడా లేకుండా.. సినిమాలో ఉన్న అందరూ హీరోలకు సమానమైన ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించడం అంటే సాహసమానే చెప్పాలి. అందుకే వాళ్ళ టెక్నికల్ బృలియన్స్ కంటే కథకులుగా వారి సాహసాన్ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా ఎవరూ ఎక్స్ ఫెక్ట్ చేయని విధంగా క్లైమాక్స్ ను డిజైన్ చేయడంతోపాటు ఎండ్ క్రెడిట్స్ లో “మార్వెల్ గర్ల్”కి సంబంధించిన గ్లింప్స్ ప్లాన్ చేయడం అనేది దర్శకుల ప్రతిభకు నిదర్శనాలు. సినిమాలో దాదాపు 22 మంది హీరోలకంటే ఎక్కువగా ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యేది విలన్ తానోస్ పాత్రకి. ఆ పాత్ర మనకి రామాయణంలోని రావణాసురుడిని తలపిస్తుంది. విజయ గర్వం కంటే బాధ ఎక్కువగా కనిపిస్తుంది అతడి స్వభావంలో. అలాగే.. విజయానికంటే ఎక్కువగా బంధాలకు విలువనిచ్చే అతడి క్యారెక్టర్ ఆడియన్స్ ను ఎమోషనల్ గా ఇన్వాల్వ్ చేస్తుంది. ఈమధ్యకాలంలో ఒక సినిమా చూసిన తర్వాత విలన్ పై జాలి కలిగిన సినిమా ఏదైనా ఉంది అంటే అది “ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్” మాత్రమే.
విశ్లేషణ : ఒక సినిమా చూసి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం అనేది ఎప్పుడో కానీ జరిగే విషయం కాదు. అలాగే ఎమోషనల్ గా ఆడియన్స్ ను రెండున్నర గంటలపాటు థియేటర్ లో కూర్చోబెట్టడం అనేది కూడా కేవలం “ఎవెంజర్స్” చిత్రానికే సాధ్యమైంది. సో, యాక్షన్ మూవీ లవర్స్ కి మాత్రమే కాదు ప్రతి మూవీ లవర్ తప్పకుండా చూడాల్సిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్”.