తెలుగు గొప్పదనాన్ని, తెలుగువారి ప్రత్యేకతను ప్రపంచానికి చాటిన ముఖ్యమైన వారిలో మహానటుడు నందమూరి తారకరామారావు ఒకరు. ఆయన నట వారసత్వాన్ని అందుకున్న బాలకృష్ణ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తుంటారు. తెలుగు వారి విశిష్టతని అందరికీ తెలిసేలా కష్టపడుతుంటారు. భారత ఖండాన్ని ఒక్కటి చేయడానికి శ్రమించిన తొలి తెలుగు చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి గురించి సినిమా తీసి అందరితో శెభాష్ అనిపించుకున్నారు. అలాగే తెలుగువారు దేవుడుగా కొలుచుకునే ఎన్టీఆర్ గురించి బయోపిక్ ని నిర్మిస్తున్నారు. అంతేకాదు మనకి అష్టాక్షరి మంత్రాన్ని ప్రసాదించిన గురు రామానుజాచార్య జీవితాన్ని రూపొందిస్తానని తాజాగా చెప్పి వార్తలో నిలిచారు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన జై సింహ సక్సస్ మీట్ లో బ్రాహ్మణుల సత్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈ ప్రకటన చేశారు. సత్కారం అనంతరం మాట్లాడుతూ “నేను ఎక్కువగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతాను.
ప్రతి పుస్తకం నుంచి ఎంతోకొంత సారాంశాన్ని గ్రహిస్తాను. అలా రామానుజాచార్య జీవితం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నా 60వ ఏట రామానుజాచార్య సినిమా చేస్తాను. ఎందుకంటే బ్రహ్మంగారి లాగానే రామానుజాచార్యకు కూడ విశేష చరిత్ర ఉంది. నవసమాజ నిర్మాణం కోసం పాటుపడ్డారు. అష్టాక్షరి మంత్రాన్ని ప్రసాదించారు. ఆయన జీవితాన్ని దృశ్య రూపంలోకి తీసుకొచ్చేలా ఓ సినిమాను నా షష్టిపూర్తి సందర్భంగా చేయబోతున్నాను” అంటూ బాలకృష్ణ వెల్లడించారు. బాలయ్య షష్టిపూర్తికి ఇంకా మూడేళ్లు టైం ఉంది. సో రామానుజాచార్య సినిమా 2020 లో సెట్స్ పైకి వెళ్లనుంది.