తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీకి ఎంతైనా ఉంది.. అందులోనూ మల్టీప్లెక్సుల వ్యవస్థ విస్తరిస్తున్న నేపథ్యంలో సింగిల్ స్క్రీన్స్ చాలా వరకు కనుమరుగైపోయాయి.. మహేష్ బాబు (ఏఎంబీ సినిమాస్), విజయ్ దేవరకొండ (ఏవీడీ సినిమాస్), అల్లు అర్జున్ (ఏ ఏ ఏ సినిమాస్) మల్టీప్లెక్సులకు ప్రముఖ ఏషియన్ సంస్థ భాగస్వామిగా ఉంది.. ఏషియన్ అల్లు అర్జున్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ అమీర్ పేటలో త్వరలో ప్రారంభం కానుంది..
ఇక హైదరాబాద్, కాచిగూడలోని తారకరామ థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. కొంతకాలంగా మరమ్మత్తులు జరుపుకుంటున్న ఈ హాల్.. ఏషియన్ తారకరామ పేరుతో రీఓపెన్ కానుంది.. డిసెంబర్ 14న నటసింహ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు మీడియా, సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.. విశ్వవిఖ్యాత ఎన్టీరామారావు మీద అభిమానంతో.. ఏషియన్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ ఈ థియేటర్ మరమ్మత్తులు మెదలు పెట్టారు..
నారాయణ దాస్ నారంగ్ తనయుడైన సునీల్ నారంగ్.. మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ థియేటర్లను కూడా కాపాడాలనే సంకల్పంతో దీన్ని కొత్త టెక్నాలజీతో రెనొవేట్ చేయించారు.. స్క్రీన్, సీటింగ్, క్యాంటీన్, పార్కింగ్ ప్లేస్ వంటివన్నీ అత్యంత వ్యయంతో తీర్చిదిద్దారు.. తాజాగా ఆ పనులు పూర్తయ్యాయి.. 4కె ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్‌తో పాటు సీటింగ్‌లోనూ మార్పులు చేర్పులు చేయించారు.. ఇంతకుముందు 975 సీటింగ్ కెపాసిటీ కలిగిన తారకరామను..
ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచేందుకు 590 సీట్లకు తగ్గించారు.. రెక్లైనర్, సోఫాల వంటివి అందుబాటులోకి తెచ్చారు.. డిసెంబర్ 14న బాలయ్య పున:ప్రారంభించిన తర్వాత డిసెంబర్ 16 నుండి హాలీవుడ్ మూవీ ‘అవతార్ 2’ ని ప్రదర్శించనున్నారు. ఈ థియేటర్ రీఓపెన్ చేయడానికి ఎంతో సహాయ సహకారాలందించిన ఎన్టీఆర్ కుమారుడు, బాలయ్య సోదరుడు నందమూరి మోహన కృష్ణ (తారకరత్న తండ్రి) కి సునీల్ నారంగ్, భరత్ నారంగ్, సురేష్ బాబు, సదానంద్ గౌడ్ తదితరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..