ఏంటో మరి బాలయ్య బాబులో మ్యాజిక్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే పంచె కట్టినా, సూటు బూటు వేసినా.. ఆ గెటప్‌కు సరిగ్గా సెట్ అయిపోతాడు నందమూరి బాలకృష్ణ. పంచె కట్టులో బాలయ్య రాజకీయం చేయడం మనం గతంలో చూశాం. ఇప్పుడు సూటుబూటు రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కార్పొరేట్ పాలిటిక్స్‌పై బాలకృష్ణ హీరోగా ఓ కథ సిద్ధమైందట. బాలయ్య ఊ అంటే… సినిమా పనులు మొదలుపెట్టేస్తారట. బాలకృష్ణతో ‘డిక్టేటర్’ తీసిన శ్రీవాస్… తాజాగా మరో కథ సిద్ధం చేశారట.
ఇందులో దేశంలో కార్పొరేట్ రాజకీయాలు, వ్యవహారాల గురించి చర్చిస్తారని తెలుస్తోంది. అందులో బాలయ్య గూగుల్ లాంటి పెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఈవోగా కనిపిస్తారని తెలుస్తోంది. ఓ చిన్న ఊరు నుండి గూగుల్ లాంటి కంపెనీకి సీఈవోగా ఎదిగిన ఓ వ్యక్తి కథ ఇది. తన ఊరికి, దేశానికి… తను సంపాదించిన జ్ఞానాన్నీ, సంపాదననీ పంచివ్వాలనుకుంటే ఏమవుతుంది? అనేది కథ అట. సినిమా పాయింట్ వింటే… ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ సినిమాల ఫ్లేవర్ సాగబోతోందని తెలుస్తోంది.
అయితే సినిమా స్క్రీన్‌ప్లే, ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటాయని చెబుతున్నారు. అన్నట్లు ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాత. ప్రస్తుతం ‘అఖండ’పనులతో బిజీగా ఉన్న బాలయ్య… ఆ తరవాత గోపీచంద్ మలినేని సినిమా పట్టాలెక్కిస్తారు. మరోవైపు అనిల్ రావిపూడి ఓ కథ తయారు చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత శ్రీవాస్ సినిమా ఉండొచ్చని టాక్.