ఏ రంగంలోనైనా పోటీ ఉంటేనే ఆట రంజుగా ఉంటుంది.. సమఉజ్జీ ఉన్నప్పుడే ఆ పోటీ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎలాగైనా గెలవాలనే కసి ఉంటుంది. మన టాలీవుడ్‌లో స్టార్స్ సినిమాలమధ్య కూడా ఇలాంటి బాక్సాఫీస్ వార్ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమాలు విడుదలవుతున్నప్పుడు, అదికూడా సంక్రాంతి సీజన్‌లో అయితే ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌లో కూడా ఆసక్తినెలకొంటుంది.. అయితేఇప్పటివరకు వీరి చిత్రాలు బాక్సాఫీస్ బరిలో పలుసార్లు పోటీపడ్డాయి.. ఒకోసారి ఒకొక్కరిది పై చేయి అయింది.
కానీ 2023 సంక్రాంతి సమరంలో ఇద్దరూ కూడా సాలిడ్ సినిమాలతో బరిలోకి దిగుతున్నారు. మెగాస్టార్ చిరుతో పాటు ప్రేక్షకాభిమానులు కూడా ఆయన నుండి బ్రహ్మాండమైన మాస్ మూవీని ఇన్నాళ్లూ మిస్ అయ్యారు. ‘వాల్తేరు వీరయ్య’ తో ఆ లోటు తీర్చబోతున్నారాయన. 2005లో ‘అందరివాడు’ తర్వాత చిరు తనకు కొట్టిన పిండి అయిన మాస్ జానర్‌లో సినిమా చెయ్యలేదు. ‘అందరివాడు’ లో గోవింద రాజులు క్యారెక్టర్‌లో చిరు మేనరిజమ్స్, కామెడీటైమింగ్ ఆకట్టుకుంటాయి.
ఈ మధ్య సినిమాల్లో మునుపటి చిరుని మిస్ అయ్యామని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ ఆ లోటుని భర్తీ చేసి, పండక్కి విందు భోజనం పెట్టేలా ఉందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. మళ్లీ పాత మెగాస్టార్‌ని చూడబోతున్నాం కాబట్టి సినిమా కచ్చితంగా అలరిస్తుందనే టాక్ వినిపిస్తోంది.. ఇక బాలయ్య విషయానికొస్తే.. ఇండస్ట్రీలో ఆయణ్ణి సంక్రాంతి సింహం అంటుంటారు.. పెద్ద పండుగ సీజన్‌లో రిలీజ్ అయిన బాలయ్య సినిమాలు చాలా వరకు సూపర్ హిట్స్ అయ్యాయి.
‘జై సింహా’ తర్వాతవచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అభిమానులను అలరించింది కానీ కమర్షియల్‌గా ఆడలేదు.ఇప్పుడు వస్తున్న ‘వీర సింహా రెడ్డి’ మళ్లీ బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పైగా ఇది బాలయ్యకి అచ్చొచ్చిన ఫ్యాక్షన్ జానర్ సినిమా కాబట్టి పక్కా హిట్ అవుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌లో విడుదలైన ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ చిత్రాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి.
బాలయ్య చివరిగా చేసిన ఫ్యాక్షన్ మూవీ ‘చెన్నకేశవరెడ్డి’.. ఇటీవలే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేయగా రికార్డ్ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు నటసింహ. టీజర్, టైటిల్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా హిట్ అవుతుందనే అనిపిస్తుందంటున్నారు. చిరు, బాలయ్య ఇద్దరూ కూడా తమకు కలిసొచ్చిన జానర్‌లో సినిమాలు చేస్తున్నారు. రెండు చిత్రాలకూ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మరి సంక్రాంతి విన్నర్ ఎవరవుతారు అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..