చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ నిర్మాతగా ఎదిగారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ ని స్థాపించి మాస్ మహారాజ్ రవితేజ తో ఆంజనేయులు సినిమా నిర్మించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి బ్లాక్ బస్టర్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రచయితని మోసం చేసినందుకు గాను అతనికి ఎర్రమంజిల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఆ కేసు వివరాల్లోకి వెళితే.. గణేష్ టెంపర్ సినిమాని నిర్మించారు. దీనిని పూరి జగన్నాథ్ డైరక్ట్ చేయగా.. వక్కంతం వంశీ కథని అందించారు. ఎన్టీఆర్ కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. అయితే ఈ కథకి పారితోషికంగా గణేష్ చెల్లని చెక్కు ఇచ్చారని వంశీ ఫిర్యాదు చేశారు. ఇరు పక్షాల వాదనలనూ విన్న కోర్టు గణేష్‌కు ఆరు నెలల జైలు శిక్షతోపాటు 15.86 లక్షల జరిమానా కూడా విధించింది. వెంటనే గణేష్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమా నిర్మాణాలకు దూరంగా ఉండగా.. వక్కంతం వంశీ అల్లు రాజును తో నా పేరు సూర్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.