ఇప్పటివరకూ పైరసీ అనేది కొందరు అవుటాఫ్ ఇండస్ట్రీ వ్యక్తులు సినిమా థియేటర్లలో సీక్రెట్ కెమెరాల ద్వారా రికార్డ్ చేసి వాటిని సీడీలు చేసి మార్కెట్ లో దొంగతనంగా అమ్మడం లేదా ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం వంటివి చేస్తుంటారని అనుకొనేవాళ్లందరికీ దిమ్మతిరిగిపోయే షాకింగ్ న్యూస్ ఒకటి నిన్న సైబర్ పోలీసులకు తెలిసింది. ఈ పైరసీ చేసే అందరూ అనుకొంటున్నట్లు అవుటాఫ్ ఇండస్ట్రీ వ్యక్తులు కాదట, ఇండస్ట్రీలో ఉన్నవారే ముఖ్యంగా కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూయర్లు ఈ పైరసీలో భాగస్వాములని తెలుస్తోంది. ఇటీవల కొందరూ ఆన్లైన్ పైరసీదారులను సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టప్రకారం అయితే.. మొదటిసారి కాబట్టి వారిని రెండ్రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచి మళ్ళీ అలాంటి తప్పు చేయొద్ధు అని గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించేయొచ్చు. వాళ్ళు కూడా అదే చేద్దామనుకొన్నారు.
కట్ చేస్తే.. సదరు ఆన్లైన్ పైరసీదారుల్ని అరెస్ట్ చేసిన మూడు నాలుగు గంటల్లోనే చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దల నుంచి ఫోన్లు వచ్చాయట. “ఏంట్రా ఈ పైరసీ కుర్రాళ్ళ గురించి ఇన్ని ఫోన్లు వస్తున్నాయి” అని పోలీసులు ఆలోచించుకొనేలోపే ఒక లాయర్ వచ్చి వాళ్ళని విడిపించుకోపోయాడట. ఆ తర్వాత ఆ కేసును కాస్త తీక్షణంగా ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులకు కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయట. ఆ పైరసీదారులను విడిపించింది స్వయానా ఒక బడా నిర్మాత. ఒక సినిమా నిర్మాత అయ్యుండి ఈ పైరసీదారుల్ని ఎందుకు విడిపించాడా అని ఆరాతీస్తే.. వాళ్ళు పైరసీ చేసింది ఈ నిర్మాతకు పడని మరో నిర్మాత ప్రొడ్యూస్ చేసిన సినిమా. అలా కొంచెం డీప్ గా ఇన్వెస్టిగేట్ చేసేసరికి.. దాదాపుగా 70% పైరసీ ఇండస్ట్రీ ఇన్నర్ సోర్సస్ నుంచే జరుగుతుందని, అది కూడా కొందరు పెద్దల అండతోనే జరుగుతుందని తెలిసింది. అయితే.. వాటి మూలాలను మాత్రం పట్టుకోలేకపోయారు. ఊరికే అంటారా “ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు” అని.