‘ఏప్రిల్ 27’ అనే డేట్ న పండగలేమీ లేకపోయినప్పటికీ మెగా అభిమానులు, ఘట్టమనేని అభిమానులు మరియు ఆలిండియా సూపర్ స్టార్ అభిమానులకు మాత్రం పండగ రోజే. ఎందుకంటే అల్లు అర్జున్ “నా పేరు సూర్య”, మహేష్ బాబు “భరత్ అనే నేను”, రజనీకాంత్ “కాలా” చిత్రాలు ఏప్రిల్ 27న విడుదలవుతున్నాయి. థియేటర్ల విషయంలో ఇబ్బందవుతుందని తెలిసినా, మార్కెట్ పరంగా ప్రోబ్లమ్స్ వస్తాయని తెలిసినా ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడంతో ఇక పోటీ తప్పనిసరి అనుకొన్నారందరూ.
కట్ చేస్తే.. మహేష్-బన్నీ కలిసి తమ రిలీజ్ డేట్స్ ను ఏప్రిల్ 26 అనగా ఒకరోజు ముందుకి జరిపారు. ముందు అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు “ఒకరోజు ముందు వస్తున్నాం” అని పోస్ట్ చేయగా.. తర్వాత “భరత్ అనే నేను” ప్రొడ్యూసర్ డి.వి.వి.దానయ్య కూడా “ఏప్రిల్ 26న వస్తున్నాం” అని ట్వీట్ చేశారు. దాంతో ఉన్నట్లుంది ఇద్దరు హీరోలు గంటల గ్యాప్ లో ఈ ప్రీపోన్ ఏంటో అర్ధం కాక కన్ఫ్యూజన్ లో పడ్డారు జనాలు. మరి ఇద్దరూ కలిసి రజనీకాంత్ కోసం తమ విడుదల తేదీలను మార్చుకొన్నారా లేక మరింకేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఈ జంట ప్రీపోన్ ల తర్వాత కూడా మహేష్-బన్నీలు ఒకేరోజున తమ చిత్రాలను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతుండడం మాత్రం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.