స్టార్ మా ఛానల్ వాళ్లు నిర్వహించిన బిగ్ బాస్ షో సీజన్ 2 నిన్నటితో ముగిసింది. దీంతో మొదటి సీజన్, రెండవ సీజన్ పై విశ్లేషణ మొదలయింది. తొలిసీజన్ 70 రోజుల పాటే సాగింది. రెండో సీజన్ 100 రోజులకు పైగా సాగి విమర్శలను, ప్రశంసలను మూటగట్టుకుంది. అయితే హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్, నానిలలో ఎవరు గెలిచారు? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. కొందరు ఎన్టీఆర్ బాగా చేసారని అంటుంటే.. మరికొంతమంది నాని టైమింగ్ తో అదరగొట్టారని ప్రశంసిస్తున్నారు. ఇక బుల్లితెర సీరియల్స్, షోల విశ్లేషకులు మాత్రం వారి మధ్య పోటీ పెట్టడం సరికాదని అంటున్నారు.
ఆ షో పరిస్థితిని బట్టి రేటింగ్.. విజయాలు మారుతుంటాయని చెబుతున్నారు. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్, తమిళ్ లో కమల్ హాసన్ మలయాళంలో మోహన్ లాల్ ల మధ్య కూడా పోలికలు, పోటీలు పెట్టడం సరికాదని స్పష్టం చేసారు. ఇక బిగ్ బాస్ అనే షో ట్రెండ్ ని తెలుగు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎన్టీఆర్ చాలా జాగ్రత్త వహించారు. ఎక్కడా శృతి మించి కుండా జాగ్రత్తపడ్డారు. తన మాటల చాతుర్యంతో షోని నిలబెట్టారు. ఇక నాని అయితే కొన్ని సార్లు స్క్రిప్ట్ చదివినట్టు అనిపించినా.. వందరోజుల పాటు ఇంట్రెస్టింగ్ గా నడిపించడంలో నాని కష్టం కూడా ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సో ఎన్టీఆర్ తన స్టయిల్లో ఆకట్టుకుంటే.. నాని తన సహజమైన విధానంలో మెప్పించారు.