యంగ్ ఎన్టీఆర్ తొలిసారి వ్యాఖ్యాతగా చేసిన బిగ్ బాస్ తెలుగు షో రికార్డులను తిరగరాసింది. ఇది వరకు ఏ తెలుగు రియాల్టీ షో కి రాని రేటింగ్స్ బిగ్ బాస్ కి వచ్చాయి. తొలి రోజు (జులై 16 ) 16.18 టీఆర్పీ(టెలివిజన్ రేటింగ్ పాయింట్) సాధించిన ఈ షో అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు స్టార్ మా ఛానెల్ ని చూసే వీక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఆ ఉత్సాహంతోనే ఛానల్ వాళ్ళు బిగ్ బాస్ షో సెకండ్ సీజన్ ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి హోస్ట్ గా నేచురల్ సార్ నాని ని సెలక్ట్ చేసినట్లు సమాచారం. అలాగే కంటెస్టెంట్స్ గా కొంతమంది పేర్లు బయటికి వచ్చాయి.
అలనాటి హీరోయిన్ రాశీ, సింగర్ గీత మాధురి, శ్యామల (ట్రాన్స్ జెండర్), తేజస్వి మాదివాడ, గజాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఈసారి సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. అప్లై చేసుకోవడానికి నిన్నటితో గడువు ముగిసింది. సామాన్యుల్లో ఎవరు సెలక్ట్ అవుతారో.. అనేది ఆసక్తికరంగా మారింది. వందరోజుల పాటు సీజన్ 2 నడుస్తుందని టాక్. జూలై లో రెండో సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని టెలివిజన్ వర్గాలు వెల్లడించాయి. ఈ మధ్య సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి కి బిగ్ బాస్ 2 లో అవకాశం కల్పించనున్నట్టు చెప్పుకుంటున్నారు.