పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బీజేపీ నేత రామ్ కదం అతడిపై ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక మోడల్ ను శారీరకంగా వేధించడమే కాకుండా.. ఆన్ లైన్ గేమ్ పేరుతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. అంతేకాదు ఆన్ లైన్ గేమ్ తో లక్షలాది మంది ప్రజలను మోసం చేశారని.. దీని ప్రమోషన్ కోసం శిల్పాశెట్టిని కూడా వాడుకున్నారంటూ చెప్పుకొచ్చారు.
తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదం మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్ 14న జుహూ పోలీస్ స్టేషన్ లో రాజ్ కుంద్రాపై ప్రముఖ మోడల్ శారీరక వేధింపుల ఫిర్యాదు చేసిందని.. పోలీసులు కేసు నమోదు చేయకపోగా.. ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆమెపై ఒత్తిడి తెచ్చింది ఎవరు..? రాజ్ కుంద్రాపై చర్యలు ఎందుకు తీసుకోలేదు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ‘గేమ్ ఆఫ్ డాట్’ అనే ఆన్ లైన్ గేమ్ ను ప్రారంభించి..
సామాన్య జనం నుండి వేల కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం గుర్తింపు ఉన్న ఆన్ లైన్ గేమ్ అని చెప్పి వియాన్ ఇండస్ట్రీస్ రూ.2500 నుండి 3000 వేల కుంభకోణానికి పాల్పడిందని చెప్పారు. ఇలా దేశ వ్యాప్తంగా చాలా మంది మోసపోయారని చెప్పారు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.