రాజమౌళి కెరీర్ లోనే అత్యంత గడ్డుపరిస్థితి ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా మొదలు పెట్టిన నాటి నుండి అసలు శకునమే బాగోలేదు. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లకు గాయాలు, ఓ హీరోయిన్ మధ్యలో వెళ్ళిపోవడాలు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అపశకునాలు ఎదురయ్యాయి. ఒకసారి చెప్పిన తేదికి ఆరు నెలలు వాయిదా వేసి 2021 జనవరిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తీరా నిరవధిక షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ వచ్చి వాలింది.
దాని వలన ఏర్పడిన లాక్ డౌన్ నాలుగు నెలలు సాగింది. లాక్ డౌన్ సడలింపులు జరిగినా షూటింగ్స్ మొదలు కావడం లేదు. దానికి కారణం కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువ కావడమే. కాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజా ప్రకటనలో కరోనా వ్యాక్సిన్ రావడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని అన్నారు. దీనితో మరింత భయం సినీ వర్గాలలో మొదలైపోయింది. కరోనా వైరస్ వ్యాప్తిని సామాజిక దూరం ద్వారా అదుపు చేయడం అనేది ఇప్పుడు జరిగే పనికాదు.
ఎందుకంటే ఈ వైరస్ దేశంలో ప్రమాదకర స్థాయికి మించి వ్యాపిస్తుంది. దీనితో చిత్రాల షూటింగ్స్ 2021 తరువాతనే అనేది స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ విడుదల 2021లో కష్టమే. 2021 లో మొదలైతే కనీసం ఏడాది సమయం చిత్రీకరణ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు పడుతుంది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ విడుదల 2022 జనవరి లేదా సమ్మర్ లో ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ని ఈ విషయం దిగ్బ్రాంతికి గురి చేస్తుంది.