Chinmayi Sripada: జానీ మాస్టర్ వివాదం.. మరో వివరణ ఇచ్చిన చిన్మయి!
- October 25, 2024 / 03:54 PM ISTByFilmy Focus
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) తాజాగా మరోసారి జానీ మాస్టర్ (Jani Master) వివాదంపై స్పందించారు. మహిళలు తమ వర్క్ ప్లేస్ లో ఎదుర్కొనే వేధింపులపై మాట్లాడిన ఆమె, మీటూ ఉద్యమం గురించి కూడా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రత్యేకంగా ఫిల్మి ఫోకస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్మయి, మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత మహిళలకు తమ హక్కులపై మరింత అవగాహన ఏర్పడిందని తెలిపారు. చిన్మయి మాట్లాడుతూ, ‘‘వేధింపులు ఎప్పటి నుంచో ఉన్నాయి.
Chinmayi Sripada

అయితే మీటూ ఉద్యమం వచ్చిన తర్వాతే మహిళలు తమ వర్క్ ఫీల్డ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టడానికి ముందుకొచ్చారు. టీనేజ్ లో ఎదురయ్యే సమస్యలు చెప్పేందుకు కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. వయస్సు పెరిగే కొద్ది ఆలోచనలో కూడా కొంత మార్పు అనేది వస్తుంది. దానికి తగ్గట్లుగానే ఎదురయ్యే సమస్యలపై రియాక్ట్ అవుతూ ఉంటాం. అలాగే జానీ మాస్టర్ వివాదంలో కూడా ఆ అమ్మాయి రియాక్ట్ అయ్యి ఉండొచ్చని చిన్మయి చెప్పుకొచ్చారు.
మహిళలు ఎక్కడైతే ఈ సమస్యను ఎదుర్కొంటారో, వాళ్ళు దాన్ని వ్యక్తీకరించే సమయం వచ్చే వరకు సమస్య కనిపించదు,’’ అని అభిప్రాయపడ్డారు. తన అనుభవాన్ని పంచుకుంటూ, ‘‘నేను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న వేధింపులపై మాట్లాడినప్పుడు, ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. అప్పటి వరకు ఉన్న అవకాశాలు కూడా రాకుండా పోయాయి. కొంతమంది సలహాలు మాత్రమే ఇచ్చారు. ఇదే పరిస్థితి చాలా చోట్ల ఉంది. అన్ని రంగాలలో కూడా మహిళలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు,’’ అని చిన్మయి చెప్పుకొచ్చారు.

సమాజంలో ఆడవాళ్లపై జరిగే వేధింపులు అన్ని రంగాలలో ఉన్నాయని, ప్రత్యేకంగా సినిమా రంగం పెద్దగా కనబడుతుందని, అందుకే ఎక్కువగా చర్చకు వస్తుందని ఆమె పేర్కొన్నారు. ‘‘మీటూ అనేది కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదు, అది కలెక్టివ్ ఫైట్. అన్ని రంగాలలో ఉన్న మహిళలు కలిసి ముందుకు వస్తే, తప్పకుండా మార్పు కలుగుతుంది,’’ అని నొక్కి చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్ ఎదురైనా, తనకు భర్త రాహుల్ సపోర్ట్ ఉండడంతో ఇంత స్ట్రాంగ్ గా నిలబడగలుగుతున్నానని చిన్మయి స్పష్టం చేశారు.












