కొణిదెల శివ శంకర్ వరప్రసాద్.. చిరంజీవిగా మారి, ఆ తర్వాత సుప్రీమ్ హీరోగా అక్కడి నుండి మెగాస్టార్ అయ్యాడు. ఈ క్రమంలో ఆయన పడ్డ కష్టం, సినిమాల పట్ల ఆయనకున్న అంకితభావం చాలా ఉన్నాయి. వీటితోపాటు కొంతమంది జర్నలిస్ట్‌లు కూడా ఉన్నారు అని చిరంజీవి చెప్పుకొచ్చారు. తన కెరీర్‌లో కొంతమంది జర్నలిస్ట్‌లు ఎలాంటి ప్రభావం చూపించారు అనే విషయాన్ని చిరంజీవి చెప్పుకొచ్చారు. జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యక్రమానికి వచ్చిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
‘ప్రాణం ఖరీదు’ సమయంలో నా ఫొటో ఎవరైనా పేపర్‌లో వేస్తే బాగుంటుందని అనుకున్నారట చిరంజీవి. ఆ సమయంలోనే చెన్నైలో ఓ జర్నలిస్ట్ ఫొటో వేసి చిరంజీవి గురించి రాశారట. అది చూసి చాలా ఆనందపడ్డ చిరంజీవి ఆయన్ను పిలిచి థ్యాంక్స్ చెప్పారు. అయితే ఉత్త థ్యాంక్స్ ఏం చెబుతాం అని అనుకుని డబ్బులు చేతిలో పెట్టబోయారట. దానికి ఆ జర్నలిస్ట్ వద్దని చెప్పి… ‘మీ లాంటి నటులను ఎంకరేజ్ చేయడానికి రాశాను. అది నా బాధ్యత’ అన్నారట. ఆయనే దివంగత పసుపులేటి రామారావు అని చెప్పారు చిరంజీవి.
ఆ ఘటనతో జర్నలిస్ట్‌ల మీద అపారమైన గౌరవం కలిగిందట చిరంజీవికి. జర్నలిస్ట్‌ల విషయంలో గౌరవంగా ఉండటానికి ఆయనే కారణమని కూడా చెప్పారు చిరు. అందుకే ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను అని కూడా అన్నారు. ఆ తర్వాత చిరంజీవి నట జీవితాన్ని తీర్చిదిద్దినవారిలో మరికొంతమంది జర్నలిస్ట్‌లు ఉన్నారట. వారే గుడిపూడి శ్రీహరిరావు, ఆంజనేయ శాస్త్రి, నందగోపాల్. వీళ్లు చిరంజీవితో మాట్లాడినప్పుడు నటన గురించి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసేవారట. అంతేకాదు కొన్ని టిప్స్ కూడా ఇచ్చేవారట.
గుడిపూడి శ్రీహరి సితారలో రివ్యూస్ రాసేటప్పుడు కొంచెం హార్స్‌గా ఉండేవని చిరంజీవి చెప్పారు. ఇదేంటి రివ్యూలో ఇంత కటువుగా చెప్పారు అనుకునేవారట చిరంజీవి. అయితే తన నటనలోని మైనస్‌లను ఓ టీచర్‌లా ఎత్తి చూపారు అనిపించేదట. ఓసారి ఓ రివ్యూలో నటనలో స్పీడ్ ఉండొచ్చు కానీ, మాటలో ఉండకూడదు అని రాశారట. తను వేగంగా మాట్లాడతాడని తెలిసినా.. సినిమాల్లో ఇబ్బంది కలుగుతోందా అని అనుకోలేదట చిరంజీవి. ఆ జర్నలిస్ట్ చెప్పింది నిజమే కదా అనిపించింది… డైలాగ్ మాడ్యులేషన్ మార్చుకున్నారట చిరంజీవి. అలా జర్నలిస్ట్‌లో తన కెరీర్‌ను మలచుకోవడంలో చాలా సాయం చేశారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.