మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారంతో త్వరలో కేంద్ర ప్రభుత్వం గౌరవించనుంది. ఇప్పటికే అనౌన్స్ చేసిన ఈ పురస్కారం… త్వరలో అందుతుంది. అయితే దానికిగాను ఆయనకు ఇప్పటివరకు టాలీవుడ్ నుండి ఎలాంటి సన్మాన గౌరవం దక్కలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ పని చేసింది. ఇప్పుడు ఏకంగా విదేశీ గడ్డ మీద తెలుగు జనాలు చిరును సత్కరించుకుని గౌరవించుకున్నారు. దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడంతో సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందిచారు. ఓ వారంపాటు ఇంటికి సెలెబ్రిటీలు క్యూ కట్టారు. అయితే కొందరు రాలేదు అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే… ఇప్పుడు అమెరికాలోని తెలుగువారు, మెగా అభిమానులంతా చిరంజీవిని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం వెనుక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సతీమణి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా చిన్న ట్రిప్ కోసం అమెరికా వెళ్తున్నామని చిరంజీవి కొన్ని రోజుల క్రితం ఎక్స్ (మాజీ ట్విటర్)లో పోస్ట్ చేశారు. అయితే చిరంజీవి అక్కడకు వెళ్లిందే ఈ సన్మాన కార్యక్రమం కోసమని కొందరు అంటున్నారు. మరికొందరు అయితే మిత్రుడి ఇంట్లో శుభాకార్యం ఉండగా.. దాని కోసమే వెళ్లారని అంటున్నారు. ఎందుకో మనకు తెలియదు కానీ… అక్కడ చిరుకు దక్కిన గౌరవం, ప్రేమకు ఆయనతోపాటు ఫ్యాన్స్ కూడా ఆనందపడుతున్నారు.
చిరంజీవి (Chiranjeevi) స్పీచులో తనకు అభిమానుల మీదున్న ప్రేమను చాటుకున్నారు. తనకు అవార్డు వస్తే మీకు వచ్చినంతగా ఆనంద పడుతున్నారు. ఇంతటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో అక్కడి అభిమానులు చిరంజీవిపై పూల వర్షాన్ని కురిపించారు. అన్నట్లు టీజీ విశ్వప్రసాద్ ఇలాంటి సన్మానాలు, గౌరవాలు ఇవ్వడంలో అందెవేసిన చేయి. మరోవైపు ఆయన నిర్మాతగా చిరంజీవి ఓ సినిమా చేస్తారనే టాక్ కూడా టాలీవుడ్‌లో ఉంది.