దేశంలో కరోనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలవ్వడంతో సినిమాల పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారబోతోందా? వరుస సినిమాల వాయిదాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తుండట, ఇంకొన్నిచోట నైట్ కర్ఫ్యూ పెట్టడంతో తర్వాతి టర్న్ లాక్‌డౌనే అని అంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అనే మాట కూడా వినిపిస్తోంది. దీంతో చాలా సినిమాల తేదీలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో రెండు సినిమాలకు సంబంధించి ప్రకటించారు.త్వరలో మిగిలిన సినిమా సంస్థలు కూడా ప్రకటిస్తాయట. అయితే ఈ క్రమంలో చిరంజీవి అభిమానులకు డబుల్ నిరాశ తప్పదు.
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వేగంగా సినిమాలు చేయాలని అనుకున్నారు. అందుకే ‘ఖైదీ నెం 150’ తర్వాత వెంటనే ‘సైరా’ ప్రారంభించారు. అదయ్యాక ఏకంగా నాలుగు సినిమాలు ఓకే చేసేశాడు. వాటికి డైరక్టర్లు, కథలు, నిర్మాతలు సిద్ధం. కానీ సినిమాలు మొదలుపెడదామంటేనే ఇబ్బంది. ఇప్పుడు కరోనా వచ్చి ఆ ఇబ్బందిని డబుల్ చేసేసింది. సెట్స్‌పై ఉన్న సినిమాలు సిద్ధం కాకపోవడం ఒక ఇబ్బంది అయితే, లైన్లో ఉన్నవి మొదలుకాకపోవడం మరో సమస్య. చిరు సినిమాల్లో ‘ఆచార్య’ సెట్స్‌పై ఉంది. షూటింగ్ త్వరితగతిన ముగిద్దాం అంటే కరోనా అడ్డుపడుతోంది.
మరోవైపు ‘లూసిఫర్’ రీమేక్ పనులు మొదలుపెడదాం అనుకుంటే… అదీ వాయిదా వేయాల్సిన పరిస్థితి. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ నెలలో సినిమా షూటింగ్ మొదలుపెడతామని చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా తిరగబెట్టడంతో సినిమా వాయిదా వేస్తున్నారట. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుండి పూర్తి సమాచారం అందుతుందని టాక్.