సాధారణంగా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల అవుతున్నప్పుడు సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదలైన ఈ భారీ బడ్జెట్ సినిమాలకు భారీ స్థాయిలో టికెట్ల రేట్లను పెంచేశారు. ఇక 29వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకి కూడా టిక్కెట్ల రేట్లను పెంచుకోవటానికి రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతులు ఇచ్చేశాయి. ఈ విధంగా సినిమా టిక్కెట్ల రేట్లను పెంచుకోవటం సరైన పద్ధతేనా అనే ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఈ ప్రశ్నకు మెగాస్టార్ సమాధానం చెబుతూ సినిమా ఎంత బడ్జెట్ లో తెరకెక్కుతోంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సినిమా టికెట్లు పెంచుకోవడంలో ఏ మాత్రం తప్పులేదని ఆయన వెల్లడించారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచిపెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్స్ వెళ్తున్నప్పుడు ఇలా మనకు అవసరమైనప్పుడు వెసులుబాటు కల్పించాలని అడగడంలో ఏమాత్రం తప్పులేదని మెగాస్టార్ తెలియజేశారు. ఇక గత మూడు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి అన్ని రంగాలకు తీవ్రస్థాయిలో నష్టాలను కలిగించింది.ఇక సినిమా ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా కారణం వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోయిందని మెగాస్టార్ తెలియజేశారు.
ఒక సినిమా కోసం ఏకంగా 50 కోట్ల రూపాయల వడ్డీ కట్టడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఆచార్య సినిమా కోసం కేవలం 50 కోట్ల రూపాయల వడ్డీ కట్టామని ఈ సందర్భంగా మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి అదనంగా మాపై పడిన ఈ భారాన్ని ఎవరు తీరుస్తారంటూ మెగాస్టార్ ప్రశ్నించారు. ఇలా మాపై పడిన ఈ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు టికెట్ రేట్లను పెంచితే కొంత ఊరట లభిస్తుందని మెగాస్టార్ వెల్లడించారు. ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే తప్పనిసరిగా ప్రేక్షకుడికి వినోదం అందించాలని సినిమాని చేస్తారు.
అయితే కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల కారణంగా అధిక వడ్డీ భారం పెరుగుదుందని ఆయన తెలిపారు. ఆచార్య సినిమాకు పెరిగిన వడ్డీతో ఒక మీడియం రేంజ్ సినిమా తీయవచ్చని ఈ సందర్భంగా చిరంజీవి ఆచార్య బడ్జెట్ గురించి వెల్లడించారు.అలాగే ఈ సినిమా కోసం గత నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారని, ఇప్పటివరకు ఎవరూ కూడా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని ఇంకా ఆ లెక్కలు సెటిల్ చేయాల్సి ఉందని ఆచార్య సినిమా బడ్జెట్ సీక్రెట్స్ అన్నీ కూడా మెగాస్టార్ బయటపెట్టారు.