చిరంజీవి మొత్తం స్పీచ్ వదిలేసి.. ఒక్క పాయింట్‌ను పట్టుకుని లాగారు అని అనుకోకపోతే.. ఆయన మాటల్లో చిన్న సెటైర్, ఇంకొంచెం పెద్ద కోపం లాంటివి కనిపించాయి. అవి ఎవరి మీదో కాదు ‘వాల్తేరు వీరయ్య’ కథానాయిక శ్రుతి హాసన్ మీద. ఆమె గురించి మాట్లాడుతూ చిరంజీవి ఓ సెటైర్ వేశారు. అయితే అది ఆమె మీద వేసిన సెటైర్ కాదు, ఇంకొకరి మీద వేసిన సెటైర్ అంటున్నారు నెటిజన్లు. దానంతటికి కారణం చిరంజీవి చెప్పిన ‘బెదిరింపు’ అనే మాట.
‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కి నాయిక శ్రుతి హాసన్ హాజరు కాలేదు. అయితే ఆమెకు అనారోగ్యం కారణంగా రాలేదని ముందుగానే చెప్పేసింది. ఆ విషయాన్ని చిరంజీవి చెబుతూ ఓ మాట అన్నారు. అదే బెదిరింపు మాట. ‘ఒంగోలులో శ్రుతి హాసన్ ఏం తినిందో కానీ.. ఆరోగ్యం బాగోలేదు అని చెబుతోంది. వంట్లో నలతగా ఉందట, జ్వరం కూడా వచ్చిందట. కరోనా టెస్ట్ కూడా చేయించిందట. ఏమైందో, లేక ఎవరైనా బెదిరించారేమో’ అని మాట్లాడారు చిరంజీవి.
ఆయన ఆ విషయాన్ని అక్కడితో కట్ చేసినప్పటికీ సోషల్ మీడియాలో చర్చ మాత్రం కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే ఒకడుగు ముందుకేసి ఆమెను ఎవరు బెదిరించి ఉంటారు, అంత అవసరం ఎవరికి ఉంటుంది అంటూ లెక్కలేసి మాట్లాడుతున్నారు. అయితే ఆ మాటలు చిరంజీవి సరదాగా మాట్లాడినట్లు అనిపిస్తోంది కానీ.. ఎందుకు మాట్లాడారు అనేదే అర్థం కావడం లేదు. దీంతో అనవసరమైన చర్చకు చిరంజీవి దారి తీశారు అని కూడా అంటున్నారు.
తన ప్రసంగం చివర్లో ‘వీర సింహా రెడ్డి’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చిరంజీవి, ఆ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకున్నాడు. ఇలా మాట్లాడిన చిరు ఆఖరున బాలయ్య మీద సీరియస్‌గా కౌంటర్ వేశాడని కొందరు అంటున్నారు. మరికొందరేమో సరదాగా అన్నారు అని అంటున్నారు. ఇలాంటి విమర్శలు వస్తాయని ముందే ఊహించిన శ్రుతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్‌కు ఎందుకు రాలేకపోతుందో వివరించింది. ‘‘జ్వరంగా ఉండటం వల్ల ఈ రోజు ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్‌కు రాలేకపోతున్నందుకు బాధగా ఉంది’’ అని చెప్పింది. అయితే ఇక్కడ చర్చకు కారణం చిరంజీవినే. కాబట్టి ఆ వ్యాఖ్యలపై ఆయనే క్లారిటీ ఇవ్వాలి.