ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం అనే ఆచారం బ్లాక్ వైట్ కాలం నుండే కొనసాగుతోంది.. మేకర్స్.. తమ ప్రాతం, నేపథ్యం, సంసృతికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించగా మంచి ఫలితాలందుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి.. అలా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ మూవీని తమిళనాట సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా రీమేక్ చేశారు.. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’.. చిరు, విజయ శాంతి జంటగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించగా.. ఎ.కోదండ రామి రెడ్డి దర్శకత్వం వహించారు.. 1989లో వచ్చిన ఈ సినిమా సాలిడ్ సూపర్ హిట్ కొట్టింది.. తర్వాత కోలీవుడ్‌లో రజినీ కాంత్ హీరోగా.. అరవింద్ నిర్మాతగా.. రాజశేఖర్ దర్శకత్వంలో ‘మాపిళ్లై’ పేరుతో రీమేక్ చేశారు.. ‘మాపిళ్లై’ అంటే తమిళంలో అల్లుడు అని అర్థం.. తెలుగులో విజయ శాంతి హీరోయిన్.. అక్కడ అమల.. ఇక్కడ ‘కళాభినేత్రి’ వాణిశ్రీ అత్తగా నటిస్తే.. అక్కడ సీనియర్ నటి శ్రీవిద్య కనిపించారు..
తన సినిమా తమిళంలో రీమేక్ చేయగా.. అందులో చిరు గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం విశేషం.. హీరో పెళ్లి చెడగొట్టడానికి వచ్చిన అల్లరి మూకతో ఫైట్ చేసి.. వాళ్లని గుడి మెట్ల దగ్గరి నుండే వెనక్కి పంపించే హీరో స్నేహితుడిగా చిరు నటించారు.. ఆ అల్లరి మూకలో మన ‘రియల్ స్టార్’ శ్రీహరి కూడా కనిపిస్తారు.. రజినీ, చిరుని తన అత్తకు పరిచయం చేసేప్పుడు రజినీ చెవిలో చిరు : ‘మీ అత్త బాగుందిరా’ అంటే.. రజినీ : ‘కొంపముంచేలా ఉన్నావ్.. నువ్వు బయల్దేరరా బాబూ’ అనడంతో ఆయన క్యారెక్టర్ ఎగ్జిట్ అవుతుంది..
చిన్న పాత్రే అయినా కానీ చిరునే తమిళ్‌లో డైలాగ్స్ చెప్పడం మరో విశేషం.. ఇంకో హైలెట్ ఏంటంటే.. తెలుగు నుండి రీమేక్ చేసిన ఈ ‘మాపిళ్లై’ ని వేరే వాళ్లు రైట్స్ తీసుకుని ‘ఆంధ్రా అల్లుడు’ పేరుతో మళ్లీ రిలీజ్ చేశారు.. ఇక హిందీలో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ జంటగా.. కోదండ రామి రెడ్డి దర్శకత్వంలోనే ‘జమై రాజా’ గా రీమేక్ చేశారు.. హేమ మాలిని అత్తగా నటించారు. విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద టి.త్రివిక్రమరావు నిర్మించారు..