డ్రగ్స్ రక్కసి ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్‌లను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈడీ, ఎన్‌సీబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలో వుండటంతో ఎప్పుడు ఎవరీ పేరు బయటకు వస్తుందా.. ఎవరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వస్తుందోనని సెలబ్రెటీలు భయపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ముంబై అరేబియా సముద్ర తీరంలోని ఓ క్రూయిజ్‌లో రేవ్ పార్టీని ఎన్‌సీబీ అధికారులు రట్టు చేసి అందులో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్ట్ చేశారు.
వీరిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారు ఆర్యన్ ఖాన్ వుండటంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఎన్‌సీబీ కస్టడీలో వున్న ఆర్యన్ ఖాన్‌ను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఎన్‌సీబీ తన పని తాను చేస్తుండగా.. అటు పక్కనుంచి ఈడీ సైతం రంగంలోకి దిగింది. బాలీవుడ్లో తారలను మనీలాండరింగ్ కేసులో విచారించే పనిలో పడింది. దీనిలో భాగంగా బాలీవుడ్ నటి నోరా ఫతేతోపాటు జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.
దాదాపు 2 వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో నోరా ఫతేకు నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గతంలోనూ ఇదే కేసులో మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రమోటర్ శివేందర్ సింగ్ కుటుంబాన్ని రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో నటి నోరా ఫతేహిపై ఆరోపణలు వున్నాయి. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తుండటంతో కొందరు బడా బాబులు వణికిపోతున్నారు.