మత విశ్వాసాల మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోన్న ఈ సమయంలో మరో వివాదం చెలరేగే పరిస్థితి ఏర్పడింది. ‘కాళీ’ పేరుతో రూపొందిన ఓ డాక్యుమెంటరీకి సంబంధించిన పోస్టర్ దీనికి కారణం. చిత్ర దర్శకురాలు లీలా మణిమేకలై ఈ మేరకు ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హిందూ దేవతను కించపరిచేలా ఆ పోస్టర్ ఉండడం ఇప్పుడు అది తీవ్ర వివాదాస్పదమవుతోంది. మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఆ పోస్టర్ ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
లీలా మణిమేకలైపై చర్యలు తీసుకోవాలంటూ దిల్లీలో ఫిర్యాదు నమోదైనట్లు సమాచారం. అయితే ఈ కథనాలపై లీలా మణిమేకలై మాత్రం తాను బతికి ఉన్నంతవరకు నిర్భయంగా తన గళాన్ని వినిపిస్తానని చెప్పారు. ‘‘నేను కోల్పోయేది ఏమీ లేదు. నేను బతికి ఉన్నంతవరకూ నేను విశ్వసించిన మాటలను భయం లేకుండా వినిపిస్తా. అందుకు నా ప్రాణమే మూల్యమైతే దాన్ని కూడా చెల్లించుకోవడానికి సిద్ధమే’’ అని అన్నారామె. తమిళనాడులోని మధురైకి చెందిన లీలా మణిమేకలై ‘రిథమ్స్ ఆఫ్ కెనడా’లో భాగంగా ‘కాళీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తెరకెక్కించారు.
కెనడాలోని టొరంటోలో ఉన్న అగా ఖాన్ మ్యూజియం ‘కాళీ’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఓ సాయంత్రం పూట మహిళ షికారు చేసే నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ ఉంటుందని లీల చెప్పారు. అయితే ఆ పోస్టర్ ఓ దేవతా మూర్తిని కించపరిచేలా ఉండడంతో విమర్శలు మొదలయ్యాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ #ArrestLeenaManimekalai అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
‘సెక్సీ దుర్గా’ పేరుతో 2017లో మలయాళీ చిత్ర దర్శకుడు సనాల్ కుమార్ శశిధరన్ తీసిన ఓ చిత్రం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కేరళలో కొన్ని వర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి కూడా ఆ చిత్రం కారణమయ్యింది. గతేదాడి వచ్చిన ‘తాండవ్’ కూడా ఇలాగా విమర్శలపాలైంది. ఇప్పుడు ‘కాళీ’ డాక్యుమెంటరీపైనా ఇలాంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.