దిల్ రాజు (Dil Raju) కెరీర్ మొదలుపెట్టిందే డిస్ట్రిబ్యూటర్ గా. పదుల సంఖ్యలో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి అనంతరం “దిల్” సినిమాతో నిర్మాతగా మారారు దిల్ రాజు. నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తర్వాత డిస్ట్రిబ్యూషన్ నుండి మెల్లమెల్లగా తప్పుకుంటూ వచ్చారు. కొన్నాళ్లపాటు డిస్ట్రిబ్యూషన్ ను కంప్లీట్ గా పక్కనపెట్టేశారు. అయితే.. నిర్మాతగా భారీ పరాజయాలు, నష్టాలు ఎదుర్కొన్న దిల్ రాజు మళ్లీ డిస్ట్రిబ్యూషన్ వైపు మొగ్గు చూపుతున్నాడు. 2025 సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో రెండు సినిమాలు దిల్ రాజు నిర్మించగా, 3వ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసారు.
ఇప్పుడు మార్చి 21న “పెళ్లి కాని ప్రసాద్” (Pelli Kani Prasad) అనే చిన్న సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు బ్యానర్.. మార్చ్ 27న విడుదలకానున్న “ఎల్2 ఎంపురాన్”ను (L2: Empuraan) కూడా విడుదల చేస్తున్నారు. దిల్ రాజు కాస్త వేగం తగ్గించిన ఇన్నాళ్లూ మైత్రీ మూవీ మేకర్స్ పరభాషా చిత్రాలకు మరియు చిన్న సినిమాలకు తెలుగు రాష్ట్రాల విడుదలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దాదాపు ప్రతివారం మైత్రీ సంస్థ నుండి ఒక సినిమా ఉండేది.
ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి దిల్ రాజు రంగంలోకి దిగినట్లున్నారు. అందుకే.. కంగారుగా కాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. “పెళ్లి కానీ ప్రసాద్” సేఫ్ ప్రాజెక్ట్ కాగా, “ఎల్2” మీద మంచి అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలు గనుక సక్సెస్ అయితే.. ఎస్వీసీ సంస్థ మరిన్ని సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ యాక్టివ్ గా మారి తమ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవచ్చు.
ఇకపోతే.. దిల్ రాజు నిర్మాతగా ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) “రౌడీ జనార్దన” మరోటి నితిన్ (Nithin Kumar) తో “ఎల్లమ్మ”. ఈ రెండు కాకుండా అల్లు అర్జున్ (Allu Arjun) తదుపరి చిత్రాన్ని కూడా తన బ్యానర్ లో నిర్మించడానికి పావులు కదుపుతున్నాడు దిల్ రాజు. ఇవన్నీ సెట్ అయితే దిల్ రాజు మళ్లీ టాప్ ప్రొడ్యూసర్ గా తన ప్రాభవాన్ని తిరిగి పొందడం ఖాయం.