టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు దిల్ రాజు. ప్రస్తుతం ఆయన విజయ్ హీరోగా ‘వరిసు’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’ పేరుతో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో దిల్ రాజు విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో సినిమా షూటింగ్ ల బంద్ సమయంలో అందరూ సినిమా షూటింగ్స్ ఆపేస్తే.. దిల్ రాజు మాత్రం ‘వారసుడు’ షూటింగ్ కంటిన్యూ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే..
‘వారసుడు’ సినిమా తమిళ ‘వరిసు’కి డబ్బింగ్ వెర్షన్ అని.. అది డబ్బింగ్ సినిమా కాబట్టి షూటింగ్ ఆపాల్సిన అవసరం లేదని చెప్పారు. అలానే ఇదివరకు డబ్బింగ్ సినిమాలకంటే స్ట్రెయిట్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అలాంటిది ఇప్పుడు సంక్రాంతికి భారీ తెలుగు సినిమాలతో పోటీగా ‘వారసుడు’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీంతో నిర్మాతల మండలి.. తమిళ సినిమాలకు తెలుగు థియేటర్లను కేటాయించకూడదని చెప్పడంతో వివాదం ముదిరింది. గత కొన్ని వారాలుగా ఇది కొనసాగుతూనే ఉంది.
అయితే దీనిపై చాలా వార్తలు వస్తున్నప్పటికీ దిల్ రాజు మాత్రం స్పందించడం లేదు. ఎప్పటిలానే తన సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘వారసుడు’ సినిమా చివరి షెడ్యూల్ జరుగుతోంది. చిరంజీవి నటిస్తోన్న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతికి విడుదల చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే రిలీజ్ డేట్స్ ను మాత్రం ప్రకటించలేదు. ఈ క్రమంలో ‘వారసుడు’ సినిమాను జనవరి 12న విడుదల చేయాలని చూస్తున్నారు దిల్ రాజు.
చిరు, బాలయ్యలను నొప్పించకుండా ఉండడానికి ప్రణాళికలు చేస్తున్నారు. ఒకవేళ ‘వారసుడు’ కోసం ఎక్కువ థియేటర్లు బ్లాక్ చేస్తే దిల్ రాజు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి ఆయన రెడీగా లేరు. అందుకే విజయ్ కి ఉన్న మార్కెట్ ప్రకారం.. థియేటర్లను కేటాయించాలని డిస్ట్రిబ్యూటర్లను కోరుతున్నారట. ఇక్కడి పరిస్థితి గురించి విజయ్ కి వివరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి దిల్ రాజు ‘వారసుడు’ సినిమా రిలీజ్ విషయంలో పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు.