తెలుగులో సీక్వెల్స్ అంటే పెద్దగా ఆడవు కానీ.. ఫ్రాంచైజీలు అంటే మాత్రం కచ్చితంగా ఆడతాయి. ఈ నమ్మకాన్ని కలిగించిన ఫ్రాంచైజీ అంటే ‘హిట్’ (HIT) అనే చెప్పాలి. సినిమా సినిమాకు స్థాయిని, రక్తపాతాన్ని పెంచుకుంటూ వెళ్తున్న ఈ ఫ్రాంచైజీ ఇప్పుడు మూడు కేసులు పూర్తి చేసుకుంది. మూడింటికి మూడు సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. దీంతో నాలుగో ‘హిట్’ ఎలా ఉండనుంది, ఎవరు చేస్తారు అనే ప్రశ్నలు వచ్చాయి. మూడో ‘హిట్’ క్లైమాక్స్ చూసినవాళ్లకు, ఆ వీడియోలు సోషల్ మీడియాలో చూసినవాళ్లకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది.
అయితే ఇప్పుడు విషయం నాలుగో ‘హిట్’ కాదు.. ఆఖరి ‘హిట్’. అవును, ‘హిట్’ సిరీస్‌లో ఆఖరిదైన ‘హిట్ సెవన్త్ కేసు’ గురించి. దర్శకుడు శైలేష్ కొలను చెప్పిన వివరాల ప్రకారం అయితే ‘హిట్’ సిరీస్ ఏడు సినిమాలతో ముగిసిపోతుంది. ‘హిట్ 4’ సినిమాను కార్తితో (Karthi) తీసిన తర్వాత.. సోలో ‘హిట్’ ఆగిపోతుందట. అంటే ఆ తర్వాత నుండి ఇద్దరేసి హీరోలు కలసి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. అంటే మల్టీస్టారర్ అన్నమాట. ‘హిట్ 5’ సినిమాలో విశ్వక్ సేన్ (Vishwak Sen) , అడివి శేష్ (Adivi Sesh) కనిపించొచ్చు.
ఇక ‘హిట్ 6’ సినిమాలో నాని – కార్తి కలసి నటించొచ్చు. లేదంటే ఇటు అటు అవ్వొచ్చు. ఇదంతా ఓకే ఏడో ‘హిట్’ సంగతేంటి అనుకుంటున్నారా? ఇందులో మొత్తం నలుగురు హీరోలు కూడా నటిస్తారట. అంటే అతి పెద్ద మల్టీస్టారర్. దీనికి సంబంధించిన కథ గురించి ఇప్పటికే శైలేష్ కొలనుకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి అని అర్థమవుతోంది. ఆ తర్వాత ‘హిట్’ ఫ్రాంచైజీ ముగిసిపోతుందట. మరి నిజంగానే ఈ నాలుగు వస్తాయా లేదా అనేది చూడాలి.
ఎందుకంటే ఇలాంటి సిరీస్ సినిమాలు ఆ ముందు సినిమా ఫలితం మీదే ఆధారపడి ఉంటాయి. అయితే ‘హిట్’ సినిమా ఫలితాలు మంచిగానే వస్తున్నాయి. మినిమమ్ గ్యారెంటీ విజయాలు అయితే వస్తున్నాయి. దానికితోడు ఈ జోనర్ ఎవర్ గ్రీన్. కాబట్టి ‘హిట్ 7’ మనం కచ్చితంగా చూస్తామనే చెప్పాలి.