సుకుమార్ డెబ్యూ మూవీ ‘ఆర్య’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. 2004 వ సంవత్సరం మే 4న ఈ చిత్రం విడుదలయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని ఫుల్ రన్లో అసాధారణమైన కలెక్షన్లను రాబట్టింది. రాజమౌళి లాంటి దర్శకుడే ‘ఆర్య’ ను చూసి.. సుకుమార్ కు పెద్ద ఫ్యాన్ అయిపోయానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
పైగా సుకుమార్ అంటే భయమేసింది అని కూడా చెప్పి ఆశ్చర్యపరిచాడు.దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ‘ఆర్య’ ఓ గేమ్ ఛేంజర్ మూవీ అని..! అయితే ఇంత గొప్ప చిత్రంలో హీరోగా చేసే అవకాశం వస్తే కొంతమంది హీరోలు మిస్ చేసుకున్నారట. ఈరోజు ఈ చిత్రం విడుదలయ్యి 17 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం రండి. ‘ఆర్య’ చిత్రం కథని దర్శకుడు సుకుమార్ ముందుగా ప్రభాస్ కు వినిపించాడట. అతను వద్దనుకున్న తర్వాత అల్లరి నరేష్ కు కూడా ఈ కథ చెప్పాడట సుకుమార్. కానీ అతను కూడా రిజెక్ట్ చేసాడు.
వీళ్ళతో పాటు ఎన్టీఆర్, రవితేజ లు కూడా ఈ కథని విని నొ చెప్పినట్టు తెలుస్తుంది. దాంతో ఓసారి అల్లు అరవింద్ గారి వద్దకు సుకుమార్ ను తీసుకువెళ్ళి ఈ కథ వినిపించాడట నిర్మాత దిల్ రాజు.ఓ కొత్త హీరో అయితే ఈ కథకి బాగుంటుంది అని అరవింద్ గారిని కోరాడట. ‘ఎవరో ఎందుకు మన బన్నీ తో చేద్దాం’ అని అరవింద్ గారు అన్నారట. అంతే ఈ కథను బన్నీ చెయ్యడం జరిగింది.అటు తర్వాత ‘ఆర్య2’ కూడా బన్నీనే చేసాడు. ఇప్పుడు మళ్ళీ సుకుమార్- బన్నీ కాంబినేషన్లో ‘పుష్ప’ మూవీ రాబోతుంది. మరి అది ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి..!