క్రేజీ హీరోయిన్ రష్మిక మండన్న కన్నడలో నటించిన చిత్రం “చమక్”. కన్నడలో 2017లో విడుదలైన ఈ చిత్రంలో గోల్డెన్ స్టార్ గణేష్ కథానాయకుడిగా నటించగా అక్కడ ఓ మోస్తరు విజయాన్ని అందుకొంది. ప్రస్తుతం తెలుగులో రష్మికకు తెలుగులో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆ చిత్రాన్ని తెలుగులో “గీతా ఛలో” అనే టైటిల్ తో అనువదించి విడుదల చేశారు. ఆ కన్నడ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులతోపాటు బంధువులందరూ ఫోర్స్ చేస్తుండడంతో తనలా పార్టీలకు అలవాటుపడిన అమ్మాయిని కాకుండా పద్ధతిగల అమ్మాయిని పెళ్లాడాలని ఫిక్సయ్యి గీతా (రష్మిక)ను పెళ్లి చేసుకొంటాడు డాక్టర్ కృష్ణ (గణేష్).
కానీ.. పెళ్ళైన తర్వాత తన భార్య తాను అనుకున్నట్లుగా పద్ధటైన అమ్మాయి కాదని, తనకంటే పెద్ద పార్టీ ఫ్రీక్ అనీ తెలుసుకొంటాడు కృష్ణ. ఆ తర్వాత ఆ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది అనేది “గీతా ఛలో” కథాంశం.
నటీనటుల పనితీరు: గోల్డెన్ స్టార్ గణేష్ ఈ సినిమాలో కాస్త యంగ్ గా కనిపించడం కోసం చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ముఖ్యంగా రష్మిక పక్కన మాత్రం గణేష్ అన్నయ్యాలా, ఇంకొన్ని ఫ్రేమ్స్ లో తండ్రిలా కనిపించాడు. ఒక యంగ్ డాక్టర్ రోల్ కి కన్నడ ప్రేక్షకులు అతడ్ని చూడగలిగారు కానీ, తెలుగు ప్రేక్షకులు మాత్రం అతడ్ని ఆదరించడం కాస్త కష్టమే.
మోడ్రన్ గర్ల్ పాత్రకు రష్మిక న్యాయం చేసింది. ఆమె క్యారెక్టర్ కు నవతరం అమ్మాయిలందరూ కాస్త గట్టిగానే కనెక్ట్ అవుతారు. మిగతావాళ్ళందరూ కన్నడ ఆర్టిస్టులే కావడంతో పెద్దగా వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సాంకేతికవర్గం పనితీరు: జుడా సంధీ సంగీతం సోసోగా ఉన్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ట్రెండీగానే ఉంది. సంతోష్ రాజ్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వేల్యుస్ కూడా బాగున్నాయి. హీరోయిన్ డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. చాలా సన్నివేశాల్లో లిప్ సింక్ అవ్వలేదు.
దర్శకుడు సునీల్ ఎంచుకొన్న కథ, ఆ కథను నడిపించడం కోసం రాసుకొన్న కథనం బాగుంది. అయితే.. కామెడీ కోసం యాడ్ చేసిన కొన్ని సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేదు. నవతరం ప్రేమికులను, వివాహ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు సునీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒరిజినాలిటీ లోపించింది. అలాగే.. కథనం మరీ నత్తనడకలా సాగడంతో ప్రేక్షకులకు బోర్ కొడుతుంది.
విశ్లేషణ: ఈ వీకెండ్ మరీ ఖాళీగా ఉండి, రష్మిక మీద విపరీతమైన అభిమానం ఉంటే తప్పితే “గీతా ఛలో” చిత్రాన్ని చివరివరకూ చూడడం కాస్త కష్టమే. ఒరిజినల్ వెర్షన్ ఆల్రెడీ హాట్ స్టార్ లో ఎవైలబుల్ ఉంది కాబట్టి ఈ సినిమాను థియేటర్లకు వచ్చి మరీ జనాలు చూస్తారని దర్శకనిర్మాతలు ఎలా ఆశపడ్డారో అర్ధం కావడం లేదు.