Gunashekar: ఆ ట్రాప్‌లో పడ్డాను… మహేష్ వార్నింగ్‌తోనే బయటకు: గుణశేఖర్
- January 28, 2026 / 02:51 PM ISTByFilmy Focus Desk
గుణశేఖర్ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. ఆయన సినిమాల్లో వేసే సెట్స్ ఎప్పుడూ హిట్టే. ‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘సైనికుడు’.. ఇలా ప్రతి సినిమాలోనూ సెట్స్‌లో ఆయన మార్క్ కనిపిస్తుంది. అయితే ఆ సినిమా తర్వాత ఆయన సినిమాల్లో సెట్స్ కనిపిచండం లేదు. ఫలితాలు కూడా అంతగా రావడం లేదు. రెండో విషయం గురించి తర్వాత చూడొచ్చు కానీ.. ముందు సెట్స్ సంగతి చూద్దాం. ఈ టాపిక్ గురించి ఆయన రీసెంట్‌గా మాట్లాడారు. ఈ క్రమంలో మహేష్ బాబు టాపిక్ కూడా వచ్చింది.
Gunashekar
భారీ సెట్స్ వేసి సినిమాలు తీయడం తనను దెబ్బ కొట్టిందని గుణశేఖర్ ఒప్పుకున్నారు. ‘సైనికుడు’ సినిమా షూటింగ్ సమయంలో వేయి స్తంభాల గుడి సెట్ వేశారు. (ఆ సెట్ అదిరిపోయింది కూడా). ఆ సెట్ వేసే సమయానికే తాను ఆ ట్రాప్‌లో పడిపోయా అని గుణశేఖర్ చెప్పారు. అదే సమయంలో మహేశ్‌బాబు కూడా ఆయన్ని హెచ్చరించారట. సెట్స్ భారీగా వేయడం వల్ల అక్కడే ఎక్కువ వర్క్ చేయాలనే ఉద్దేశం పెరుగుతోంది. దీంతో కథ అటువైపు తిరుగుతోందని అనిపిస్తోంది అని హెచ్చరించారట.

అప్పుడు గుణశేఖర్ ఆలోచిస్తే, అది కూడా నిజమే కదా అనిపించింది. సెట్ వేశాం కదా అని, అక్కడ సన్నివేశాలు పెంచడంతో కథ లిమిట్ అయిపోతోంది అనిపించిందట. ఆ మాటలతో రియలైజై మళ్లీ సెట్స్ జోలికి వెళ్లకూడదని అనుకున్నారట గుణశేఖర్. నిజంగానే ఆయన ఆ తర్వాత తీసిన సినిమాల్లో ఆ స్థాయిలో పెద్ద సెట్స్ ఏవీ వేయలేదు. ‘వరుడు’ సినిమా కోసం కల్యాణ మండపం సెట్ ఒకటి వేశారు. ఇంకొకటి ఫైట్ కోసం పెద్ద పొగ గొట్టం సెట్ వేశారు.
ఇక రెండో టాపిక్ విషయానికొస్తే.. సెట్స్ వదిలేసినట్లే ఆయన విన్నింగ్ ట్రాక్‌ను కూడా వదిలేశారు. ఇప్పుడు మళ్లీ విజయాల దారిలోకి రావడానికి ‘యుఫోరియా’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదల కానుంది. 20 ఏళ్లకుపైగా ఆయన వెయిట్ చేస్తున్న ఆ సరైన విజయం ఈ సినిమా ఇస్తుందేమో చూడాలి.
















