ప్రపంచం ఎదురు చూస్తున్న సినిమా.. ప్రపంచంలో మేటి అనిపించుకున్న నటీనటులు ఎదురుచూస్తున్న సినిమా.. అలాంటి సినిమా వచ్చినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని ఊహిస్తాం చెప్పండి. అందులో ఏ మాత్రం స్థాయికి తగ్గ లేకపోయినా, ఊహకు తగ్గ లేకపోయినా తీవ్రంగా నిరాశ చెందుతాం. దానికి కారణం అంచనాలు. పెద్ద హీరోలు, అతి పెద్ద నటులు, అంతకుమించిన బడ్జెట్.. ఇలా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా బిగ్గర్ ద్యాన్ బిగ్గర్ మూవీ అయింది. అయితే ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) చేసిన కొన్ని ఇబ్బందులు సినిమాను ఇబ్బంది పెట్టాయి అని చెప్పొచ్చు.
సినిమా చూసొచ్చిన వాళ్లను ఎవరినైనా కథ ఏంటి అనడిగితే.. కాసేపు మౌనంగా ఉండకపోతే చూడండి. ఎందుకంటే సినిమా కథంతా ట్రైలర్‌లో చెప్పేశారు. ఇంటర్ కట్ షాట్లతో చాలావరకు అర్థం చేసేశారు. అందుకే కథ కొత్తగా ఏముంది ట్రైలరే కదా అని చెబుతారు. సినిమాలో మూడు ప్రాంతాలు ఉంటాయి అని ముందే చెప్పారు. సినిమాలో తొలి అర్ధ భాగం మొత్తం ఆ ప్రాంతాలు, అందులోని పాత్రల పరిచయానికే వదిలేశారు. దీంతో స్లో స్లోగా సినిమా సాగిపోతుంది. ఎక్కడా బలమైన ఎలిమెంట్ కనిపించదు.
రెండో భాగానికి వచ్చినప్పటికి సినిమా స్పీడ్ అందుకుంటుంది. అయితే శంబలను చూపించే సమయంలో మళ్లీ స్లో అయిపోతుంది. ఇది అప్పటివరకు ఉన్న ముమెంటెమ్‌ను దెబ్బ తీసింది అని చెప్పాలి. సినిమాలో చాలా పాత్రలు కనిపిస్తాయి, అందులో దీపిక పడుకొణె (Deepika Padukone) , అమితాబ్ (Amitabh Bachchan) పాత్రలు మినహా మిగిలిన వాటికి సరైన కనెక్టివిటీ కనిపించదు. శంబల ప్రాంత ప్రజల కష్టాలకు కారణం ఎవరు, ఇప్పుడు ఎలా బతుకుతున్నారు అనే వివరాలు సినిమాలో సరిగ్గా ఉండవు. కాశీలో ఉన్నవాళ్లకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు అని చెబుతుంటారు సినిమాలో.. కానీ ప్రజలు ఎలా బతుకుతున్నారు.
దేవుడు పుట్టబోయే గర్భం అంటూ దీపికను గొప్పగా చూస్తుంటారు శంబల వాసులు. అయితే ఆమె వెనుక బలమైన కథ లేకపోవడంతో.. ఆ పాత్ర తేలిపోయినట్లు కనిపిస్తుంది. శంబల ప్రాంతాల పోరాటం గురించి సినిమాలో పెద్దగా చూపించింది లేదు. కేవలం వాళ్లు ‘రేపటి కోసం పోరాడుతున్నారు’ అని మాత్రం చెబుతారు. శోభన (Shobana) పాత్రను ఓ గొప్ప రాజమాతగా చూపించే ప్రయత్నం చేశారు.. కానీ అర్ధవంతంగా ముగించలేదు. ఇక హీరోయిన్ పాత్రను కూడా చటుక్కున క్లోజ్ చేశారు.
అన్నింటికి మించి అతిథి పాత్రలు సరిగ్గా వర్కవుట్ కాలేదు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda),పోషించిన అభిమన్యుడి పాత్ర.. మిస్ ఫైర్ అయిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. వీటన్నింటికి తోడు చాలా అనవసర, అదనపు సన్నివేశాలు సినిమా ఫ్లోను ఇబ్బంది పెట్టాయి. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకొన్ని రోజులు కూర్చుని ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కావు అని నెటిజన్లు అంటున్నారు.