శంకర్ సినిమాల్లో భారీతనం ఉంటుంది అనేది పక్కా. ఆయన ప్రేమకథ తీసినా… అందులో ఓ గ్రాండ్‌నెస్ చూపిస్తారు. అందుకే శంకర్ సినిమా వస్తోందంటే ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఏదో తెలియని మ్యాజిక్ చేయడం శంకర్‌కి అలవాటు. ఆయన చేసే మ్యాజిక్‌కి విజువల్ ఎఫెక్ట్స్ బాగా ఉపయోగపడతాయి. మనిషిని యంత్రంలా మార్చాలన్నా, హీరోయిన్‌ని మోటార్ బైక్‌లా మార్చాలన్నా ఆయన ఆలోచనలకు సాధ్యం. యంత్రానికి ప్రేమ అలవాటు చేసిన దర్శకుడు ఆయన. ఆయన ఆలోచనలు ఏకంగా హాలీవుడ్ డైరక్టర్లను ఇన్‌స్పైర్ చేస్తున్నాయి అంటే నమ్ముతారా. అదే జరిగింది.
‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా హాలీవుడ్‌లో ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్ చూసి ప్రపంచ సినిమా అభిమానులు మురిసిపోయారు. అయితే ఆ సీన్స్‌లో కొన్ని తెరకెక్కించడానికి ఆయన శంకర్ సినిమా ‘రోబో’ను స్ఫూర్తిగా తీసుకున్నారు అంటే నమ్ముతారా? ఈ విషయం రూసోనే చెప్పారు. ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ‘రోబో’ సినిమాలోని కొన్ని సీన్లను స్ఫూర్తి పొందానని చెప్పారు.
చిన్న చిన్న రోబోలన్నీ కలిపి పెద్దగా మారడం, అమాంతం భారీకాయుడిలా కనిపించడం లాంటి సీన్స్ స్ఫూర్తిగా ఎండ్‌గేమ్‌లో కొన్ని సీన్స్ రూపొందించారట. ‘జెంటిల్‌మ్యాన్’ సినిమాతో దర్శకుడిగా మారిన శంకర్ ‘ప్రేమికుడు’, ‘జీన్స్’, ‘బాయ్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించారు. ‘ఎంథిరన్’తో రికార్డులు సృష్టించారు. ఆ తర్వాత ‘2.0’తో మరోసారి తన సత్తా చాటారు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు నిరాశపరిచినా.. శంకర్ మేనియా ఎప్పుడూ ఉంటుంది. అందుకే శంకర్ సినిమాకు బడ్జెట్‌కు పరిమితులు ఉండవు, వసూళ్లకు పరిమితులు ఉండవు.
ప్రస్తుతం శంకర్… రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ రూపొందిస్తున్నారు. ఈ రెండూ కాకుండా ‘భారతీయుడు’ సీక్వెల్ ‘ఇండియన్ 2’ సిద్ధమవుతోంది. శంకర్ – రామ్‌చరణ్ సినిమా వచ్చే సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. అవినీతి నిర్మూలన అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమా ఉండొచ్చని సమాచారం.