‘ధృవ’ సినిమా క్లైమాక్స్‌లో విలన్‌ను కాపాడటానికి హీరో చాలా ట్రై చేస్తాడు గుర్తుందా? ఎందుకు కాపాడాలని అనుకున్నాడు అనేదే సినిమా క్లయిమాక్స్ అంటే మెయిన్ పాయింట్. అయితే హీరో అనుకున్నట్లు విలన్‌ను కాపాడలేకపోతాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు మరోసారి లాంటి పాయింట్‌తో సినిమా రాబోతోంది. అవును.. విలన్‌ను కాపాడే హీరో అనే కథాంశంతో ఓ సినిమా సిద్ధం చేశారు. మరో వారం రోజుల్లో ఆ సినిమా రాబోతోంది కూడా.
ఏంటీ.. ఆ సినిమా ఏంటో అర్థమైపోయిందా? ఆఁ.. అదే ‘కస్టడీ’ సినిమా. (Naga Chaitanya) నాగచైతన్య, కృతి శెట్టి జంటగా విక్రమ్ ప్రభు తెరకెక్కించిన ద్వి భాషా చిత్రం ‘కస్టడీ’. ఈ నెల 12న సినిమాను విడుదల చేస్తున్నారు. మామూలుగానే వెంకట్ ప్రభు సినిమాలు, స్క్రీన్‌ప్లే విభిన్నంగా ఉంటాయి. రొటీన్‌కి భిన్నంగా ఆలోచించడం వెంకట్ ప్రభు తరహా కూడా. అదే అతనికి విజయాల్ని కట్టిపెడుతోంది అని అంటుంటారు. అలాంటి వెంకట్ ప్రభు తొలిసారి తెలుగులో ఓ సినిమా చేశారు అంటే ఎంత వైవిధ్యంగా ఉంటుంది చెప్పండి.
అదే మేం చెప్పబోయే డిఫరెంట్ పాయింట్. ‘కస్టడీ’ సినిమాలో హీరో, విలన్ మధ్య రెగ్యులర్ టైప్ ఘర్షణ ఉండదట. సాధారణంగా ప్రతి సినిమాలో.. హీరో వెంట విలన్, విలన్ వెంట హీరో పడుతుంటారు. ఒకరికొకరు ఎదురుపడితే యుద్ధమే. విలన్ ఆట కట్టించడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే ‘కస్టడీ’ సినిమాలో అలా కాదు అంటున్నారు. ఈ సినిమాలో విలన్‌ని కాపాడటమే హీరో మిషన్ అంటున్నారు. అలా కథ, కథనం రాసుకున్నారట వెంకట్‌ప్రభు.
విలన్‌కి వచ్చే కష్టాల్ని, ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి రక్షణ కల్పిస్తుంటాడట హీరో. అదే ఈ సినిమాలోని కొత్తదనం అని అంటున్నారు. అంతే కాదు ఈ పాయింటే ఈ సినిమాకు స్పెషల్ అవుతుంది అని కూడా చెప్పారు. ఈ విషయాన్ని ముందుగా రివీల్ చేసి టీమ్ అభిమానులకు, ప్రేక్షకులకు హింట్ ఇచ్చింది. అయితే ఎందుకు కాపాడాడు అనేదే సినిమా అంటున్నారు. దీని సంగతేంటో తేలాలంటే మే 5న వచ్చే ట్రైలర్ చూడాలి అంటున్నారు.