ఆచార్య మూవీలో కాజల్ పాత్ర లేదంటూ ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ బాంబు పేల్చారనే సంగతి తెలిసిందే. కాజల్ తప్పుకున్న సమయంలోనే ఈ విషయం చెప్పి ఉంటే బాగుండేదని సినిమా రిలీజ్ సమయంలో ఈ విషయం చెప్పడం ఏమిటని కాజల్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రతి సినిమాలో హీరోయిన్ల పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దిన కొరటాల శివ ఈ సినిమా విషయంలో మాత్రం ఒక హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దలేకపోయారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కాజల్ పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేని పక్షంలో ఆమెను సినిమాలోకి తీసుకోకుండా ఉంటే బాగుండేదని సినిమాలోకి తీసుకున్నామని ప్రకటించి లాహే లాహే పాటలో కాజల్ ను చూపించి ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని కాజల్ ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఆచార్య సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిష ఎంపికయ్యారు. అయితే త్రిష ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ఎంపిక కాగా కాజల్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకోవడం గమనార్హం.
చరణ్ పాత్ర నిడివిని పెంచాలని హీరోయిన్ పాత్రను తగ్గించారని అందుకే ఈ సినిమా నుంచి ఇద్దరు హీరోయిన్లు తప్పుకున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి పాత్రకు హీరోయిన్ లేకపోవడం సినిమాకు ఒక విధంగా మైనస్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆచార్య సినిమాతో చిరంజీవి, చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఇదే కావడం గమనార్హం. కొరటాల శివ ఈ సినిమాకు పాతిక కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. కొరటాల శివ నాలుగేళ్లుగా ఈ సినిమాకు పరిమితం కావడం గమనార్హం.