మేం గొప్ప, మా సినిమా గొప్ప అంటూ చాలా ఏళ్లపాటు గొప్పగా చెప్పుకున్నారు బాలీవుడ్ జనాలు. మిగిలిన భాషల సినిమాలను తక్కువ చేస్తున్నారు అనే విమర్శలు కూడా వచ్చేవి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఎలాంటి సినిమా చేసినా సరైన విజయం అందడం లేదు. గతంలో భారీ విజయాలు అందుకున్న కాన్సెప్ట్‌లు ఇప్పుడు ఏ మాత్రం చాలడం లేదు. అయినప్పటికీ ఇప్పటికీ మా స్టైలే, మా సినిమాలే గొప్ప అని అంటుంటారు. ఇలాంటి వాళ్లు ఇప్పుడు ‘జవాన్’ సినిమాను యాక్సెప్ట్ చేస్తారా?
అయినా ఇదేం డౌట్. ఈ సినిమా (Jawan) షారుఖ్ ఖాన్‌ది. ఎందుకు యాక్సెప్ట్ చేయరు, ఎందుకు హిట్ చేయరు అనేగా మీ డౌట్. ఉంది దీని వెనుక పెద్ద కారణమే ఉంది. మొన్నటివరకు డౌట్ డౌట్‌గా ఉన్న కొన్ని విషయాలు ఇటీవల సినిమా టీజర్ వీడియోతో క్లారిఫై అయ్యాయి. అదే ఆ సినిమా పేరుకే హిందీ కానీ, కనిపించేవాళ్లంతా తమిళ వాళ్లే. అంటే తమిళ సినిమా పరిశ్రమకు చెందినవాళ్లే అని అర్థం. కావాలంటే మీరే చూడండి హీరో, నిర్మాత తప్ప మిగిలిన టీమ్‌లో అధిక భాగం కోలీవుడ్ జనాలే.
కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఎదిగిన నటీనటులు, టెక్నీషియన్లే ఈ సినిమాకు చాలా వరకు పని చేశారు అని చెప్పాలి. హీరోయిన్ సంగతి చూస్తే.. నయనతార. మలయాళ పరిశ్రమ నుండి వచ్చినా ఆమె తమిళంలో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇక మరో కీలక పాత్రలో కనిపించనున్న ప్రియమణి కూడా ఇంతే. ఇక మరో కీలక పాత్ర పోషించిన విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం అందించింది అనిరుధ్ రవిచందర్.
సినిమాటోగ్రఫీ బాధ్యతలు జీకే విష్ణుకి అప్పజెప్పారు. ఇక రైటింగ్, డైరక్షన్ టీమ్‌లో అందరూ తమిళులే అట. దీంతో ఈ టీమ్ తీసిన సినిమాతో బాలీవుడ్ ఎలా ముందుకెళ్తారు అని అంటున్నారు. అయితే ‘పఠాన్’ జోరులో ఉన్న షారుఖ్ ‘జవాన్’లో అదరగొడతాడు అని బాద్‌షా ఫ్యాన్స్, బాలీవుడ్ జనాలు వెయిట్ చేస్తున్నారు.