మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ఏం మాట్లాడినా.. ఏం ట్వీటేసినా అది సంచలనంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు కూడా ఓ ట్వీట్ తో వివాదానికి తెరలేపినట్టు అయ్యింది. నిన్న 10 గంటలకు ఆయన ఈ ట్వీట్ వేయడం జరిగింది. ఆ ట్వీట్ ను గమనిస్తే.. ” ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే,మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!’ ” అంటూ అందులో పేర్కొన్నారు నాగబాబు. ఆ ట్వీట్ ఎవరికోసం అనేది ఆయన ప్రస్తావించింది లేదు.
అయితే ఇది పరోక్షంగా అల్లు అర్జున్ కి (Allu Arjun) కౌంటర్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం ఏంటి అనేది ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండవచ్చు. వివరాల్లోకి వెళితే… మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నాగబాబు..ల ‘జనసేన’ పార్టీకి సపోర్ట్ చేసింది. అందుకోసం మెగా హీరోలు ప్రత్యేకంగా పిఠాపురం వెళ్లి.. ప్రచారంలో భాగంగా అందరిలో హుషారుని నింపే ప్రయత్నం చేశారు. కానీ బన్నీ మాత్రం ఒక ట్వీట్ వేసి సరిపెట్టాడు.
అక్కడితో ఆగిపోతే పర్వాలేదు. తర్వాత అతను వైసీపీ నంద్యాల అభ్యర్థి అయిన శిల్ప రవి ఇంటికి వెళ్లి.. ‘అతనికి ఓటు వేసి గెలిపించాలని’ ప్రచారం చేశాడు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య అంతా..! ‘తన ఫ్యామిలీ అంతా జనసేన పార్టీకి మద్దతుగా ఉంటే బన్నీ మాత్రం వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి తరఫున ప్రచారం చేయడం ఏంటి?’ అనే ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ క్రమంలో బన్నీ .. ‘శిల్ప రవి ఏ పార్టీలో ఉన్నా నాకు సంబంధం లేదు.
కేవలం అతని తరఫున మాత్రమే ప్రచారం చేశాను’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ ‘అతని తరఫున కూడా ట్వీట్ వేసి సరి పెట్టొచ్చు కదా.. ఎందుకు ప్రచారం గడువు ముగిశాక కూడా వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికాడు?’ అనేది జనసైనికుల వాదన. ‘నాగబాబు కూడా అందుకే బన్నీపై ఇలా కౌంటర్ వేశారని’ ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. దీనికి నాగబాబు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.
మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!