మాకు ఎంతో స్పెషల్ అయిన మే9న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాను రిలీజ్ చేస్తున్నాం అని చాలా రోజుల క్రితమే సినిమా టీమ్ ఘనంగా అనౌన్స్ చేసింది. కౌంట్ డౌన్ కూడా పెట్టి మరీ ఆ విషయాన్ని చెప్పింది. అయితే ఏమైందో ఏమో… ఇప్పుడు ఎలాంటి సప్పుడు లేదు. కనీసం సినిమాను వాయిదా వేసేశాం అని కూడా టీమ్ చెప్పడం లేదు. అలా అని సడన్ సర్‌ప్రైజ్ అంటూ రిలీజ్ చేసే చిన్న సినిమా కూడా కాదు ఇది. దీంతో అసలు ఎందుకు రిలీజ్ డేట్ విషయంలో మౌనం పాటిస్తున్నారు అనే చర్చ మొదలైంది.
అయితే, తాజాగా ఓ చర్చ ప్రకారం చూస్తే సినిమా విడుదల వాయిదా వేయడానికి కారణం టికెట్ రేట్లు అని చెబుతున్నారు. అదేంటి టికెట్ రేట్లు ఇప్పుడు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు కదా. చాలా సినిమాలు అలానే చేస్తున్నాయి కదా అని మీరు అనొచ్చు. అయితే ఇది అన్ని ప్రాంతాల్లో లేదు. అలాగే అందరి సినిమాలకు కూడా ఈ పరిస్థితి లేదు. అందులోనూ టీడీపీ సానుభూతిపరులు అయిన హీరోలు, నిర్మాతల సినిమాలకు అయితే పెంపు అనేది ఆంధ్రప్రదేశ్‌లో కష్టంగా ఉంది. కొన్నిసార్లు అవ్వడం లేదు కూడా.
ఈ కారణంగానే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రిలీజ్‌ను టీమ్ వాయిదా వేసుకుంది అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సారి ప్రభుత్వ మార్పిడి పక్కా అని అంచనాలు వస్తున్న నేపథ్యంలో జూన్ 4న ఫలితాలు వచ్చే ఎన్నికల ఫలితాలు బట్టి నిర్ణయం తీసుకుందాం అని అనుకుంటున్నారట. ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఏంటి అనే విషయంలోనూ చర్చలు నడుస్తున్నాయని ఒక టాక్. అయితే పరిశ్రమకు మంచి జరిగేలా ఫలితాలు ఉంటాయి అనేది గట్టి నమ్మకం.
అయితే, సినిమాకు సంబంధించి బిజినెస్ ఇంకా అవ్వలేదని, విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ పనులు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయని మరికొందరి వాదన. ఏదేమైనా విషయం తేలాలి అంటే జూన్ 4 మధ్యాహ్నం దాటాల్సిందే అని చెప్పొచ్చు.