నాగవంశీకి సరైన విజయం వచ్చి చాలా నెలలు అయిపోయింది. గతేడాది ‘లక్కీ భాస్కర్’ తర్వాత ఏ సినిమా కూడా ఆయనకు కలసి రావడం లేదు. పెద్ద హీరోలతో ప్రయత్నాలు చేసినా ఏవీ కలసి రాలేదు. ‘వార్ 2’ సినిమా రిలీజ్ చేసినా, ‘రెట్రో’ రిలీజ్ చేసినా, ‘కింగ్డమ్’ తీసినా, ‘మాస్ జాతర’ చేసినా ఫలితాలు రాలేదు. కట్ చేస్తే ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో తిరిగి విజయం అందుకున్నారు నాగవంశీ. దీంతో ఆయనకు కొండంత బలం వచ్చింది. తనను ట్రోల్ చేసినవారందరికీ తగిన రిప్లైలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో సితార సినిమాల గురించి, అందులోనూ పెద్ద విజయాలు, భారీ వసూళ్లు అందుకున్న సినిమాల గురించి చూస్తే.. ఓ పాయింట్ కామన్‌గా కనిపిస్తోంది. ఆయన బ్యానర్‌లో వచ్చిన టాక్, క్యాష్ రెండూ అందుకున్న సినిమాలు ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’. ఆ సినిమాల తర్వాత ఆ స్థాయి విజయం ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో వచ్చింది అని చెబుతున్నారు. సంక్రాంతి బొమ్మగా వచ్చి ఈ పిక్చర్ టాక్ బాగుండటంతో మంచి వసూళ్లనే అందుకుంటోంది. ఈ రెండు సినిమాలకు ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది.

అదే సినిమా కోసం హీరోలు పడిన కృషి. రెండు ‘టిల్లు’ సినిమాల వెనుక హీరో సిద్ధు జొన్నలగడ్డ చాలా కష్టపడ్డాడు. దర్శకుడికి తెలియని సీన్లు, డైలాగ్‌లు ఆ సినిమాల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని సిద్ధునే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. స్పాట్ ఇంప్రూవైజేషన్‌తో చాలా సీన్లు బాగా పండాయి. ఆ రెండు సినిమాలు మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ సినిమా కోసం నవీన్ పొలిశెట్టి ఇంచుమించు ఇలాంటి కష్టమే పడ్డాడు. అందుకే టైటిల్ కార్డ్స్‌లో కూడా పేరు వేశారు. ఇక డైరెక్టర్ అయితే ప్రచారానికే రాలేదు. ఇదంతా చూస్తుంటే హీరోలు ఇంటర్వీన్ అయితే నాగవంశీకి విజయాలు పక్కా అని చెప్పొచ్చు.
