ఉవ్వెత్తున ఎగిసే కెరటం ఎప్పటికైనా కిందకు పడక మానదు.. అయితే పడినంత వేగంగా పైకి లేవకపోతేనే సమస్య. ప్రస్తుతం అలా కిందపడి.. పైకి లేచే పనిలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. వరుస విజయాలు, మంచి సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో ‘లైగర్’ లాంటి డిజాస్టర్ ఇచ్చి మొత్తం పోగొట్టుకున్నారు. దీంతో మళ్లీ తన కెరీర్‌ను గాడినపెట్టుకునే పనిలో ఉన్నాడు. వరుసగా కథలు వింటూ, ఓకే చేస్తూ, అనౌన్స్‌మెంట్‌లు కూడా ఇచ్చేస్తున్నాడు. అయితే ఇక్కడే ఓ సమస్య కనిపిస్తోంది. అదే తనకంటూ ఓ కథ.
‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’తో హఠాత్తుగా స్టార్ హీరో ఇమేజ్ వైపు సాగాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత సినిమాల ఎంపికలో వరుస తప్పులు చేస్తూ ఇబ్బందిపడ్డాడు. 2018 తర్వాత విజయ్‌కి సరైన విజయం లేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో ఎలాగైనా కుంబస్థలం కొట్టాలని పూరి జగన్నాథ్‌తో ‘లైగర్’ చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో కెరీర్‌లో ఇబ్బంది పడ్డాడు. హిట్ కొడితేనే హీరో అనే మాట మరోసారి నిజమైంది.
ఆ సినిమా నుండి తనను తాను రెడీ చేసుకుంటూ.. ఇప్పుడు వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నాడు. మొన్నీమధ్య గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడు. అయితే ఈ రెండు వేరే హీరోలు వదిలేసిన కథలే అంటున్నారు. గౌతమ్ సినిమా కథ రామ్‌చరణ్ వద్దనుకున్నదని టాక్. ఇక పరశురామ్ సినిమా నాగచైతన్యకు చెప్పాక అంతా ఓకే అనుకుని ఆపేసిన సినిమా అని సమాచారం.
దీంతో వేరేవాళ్లు వదిలేసిన కథలు చేయడమేనా? మనకంటూ ఓ కథ చెప్పే దర్శకరచయితలు లేరా అని ఫ్యాన్స్ చెవులు కొరుక్కుంటున్నారు. హీరో కెరీర్‌లో లో ఫేజ్ అనేది కామన్. ప్రతి హీరో ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి దాటి వచ్చే ఉంటాడు. అయితే ఇలాంటి సమయంలో తన ప్రత్యేకతను చాటిచెప్పే కథలు రావడమూ కష్టమే. కానీ ఇక్కడ పప్పులో కాలేస్తే ఇంకా ఇబ్బందుల్లో పడతారు. విజయ్ ఈ విషయాలు అన్నీ చూసే.. సినిమాలను ఓకే చేస్తున్నాడు అని ఆశిద్దాం.