సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి కొంతమంది విజయం సాధించారు. మరికొంతమంది విఫలమయ్యారు. తాజాగా రాజకీయాల్లోకి విశ్వనటుడు కమలహాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ అడుగుపెట్టబోతున్నారు. వీరికి అభిమానులు ఘన స్వాగతం పలుకుతుంటే ఇప్పటికే రాజకీయంలో అనుభవం కలిగిన నటి మాత్రం హెచ్చరిస్తోంది. నందమూరి తారక రామారావు ఆహ్వానముతో తెలుగుదేశం పార్టీలో చేరిన అలనాటి నటి జయప్రద, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పక్షములో చేరి టీడీపీ మహిళా విభాగానికి అధ్యక్షురాలైంది. అలాగే రాజ్యసభకు ఎన్నికైంది. ఆ తర్వాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరి లోక్ సభకు ఎన్నికైంది.
ఇంత అనుభవం కలిగిన జయప్రద మాట్లాడుతూ “రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదు. రాణించడం చాలా కష్టం. సినిమాలకు, రాజకీయాలకూ ఏ మాత్రం సంబంధం ఉండదు. కమలహాసన్, రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని నేను స్వాగతిస్తున్నాను. వీరిద్దరూ నడవాలని భావిస్తున్న దారి పూల దారేమీ కాదు. ఎన్నో ముళ్లు, రాళ్లతో నిండిన క్లిష్టమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. జాగ్రత్తగా చూసి అడుగు వేయాలి. అయినా జయలలిత మరణంతో తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను వీరు తొలగించే అవకాశాలు ఉన్నాయి” అని అన్నారు. మరి వీరిలో ఎవరు రాణిస్తారన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని జయప్రద చెప్పారు.