ఎన్టీఆర్..మొన్నటి వరకు ఈ పేరు టాలీవుడ్లోనే కానీ ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకున్న హీరో. అచ్చు గుద్దినట్లు పెద్దాయన నందమూరి తారక రామారావుని పోలినట్లు వుండే బుడ్డ రామారావు. డ్యాన్స్, ఫైట్లు, నటన విషయంలో పెద్దాయన లక్షణాలను పుణికి పుచ్చుకోవడమే కాదు తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించారు. కానీ ఈ స్టార్‌డమ్, గుర్తింపు అంత సులభంగా ఆయనకు దక్కలేదు. ముందు కుటుంబం నుంచే ఎన్టీఆర్‌కు సపోర్ట్ లేదు.
నందమూరి కుటుంబం జూనియర్‌ను దగ్గరకు రానివ్వని సందర్భాలు వున్నాయని ఇండస్ట్రీలో ఇప్పటికీ చెప్పుకుంటారు. తల్లి చాటు బిడ్డగానే ఎన్టీఆర్ పెరిగారన్నది అందరికీ తెలిసిందే. ఆ కసితోనే తనను తాను నిరూపించుకున్నారు జూనియర్. నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ వన్, సుబ్బు చిత్రాలతో జూనియర్ ఎన్టీఆర్ పేరు అప్పుడప్పుడే ఆంధ్ర దేశానికి తెలుస్తోంది. రామారావు గారి మనవడంట.. ఆయనలాగే వున్నాడు, బాగా నటిస్తున్నాడని జనం చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో అరుదైన, మరుపురాని ఘటన జరిగింది.
2001 సినీ గోయర్స్ అవార్డుకు ఎన్టీఆర్ ఎంపికయ్యారు. దీనిని అందజేసేందుకు ఒక సూపర్‌స్టార్ వచ్చారు. ఆయన ఎవరో కాదు.. నందమూరి బాలకృష్ణ. అలాంటి క్షణం కోసం ఎదురుచూస్తోన్న జూనియర్ ఎన్టీఆర్‌కు మాటలు రావడం లేదు. స్టేజ్ మీదకు వచ్చిన బాలయ్య.. జూనియర్‌కు అవార్డ్ అందజేసి… ఎన్టీఆర్‌పై చేయి వేశాడు. వారిద్దరినీ పక్కపక్కనే చూడడానికి అభిమానులకు రెండు కళ్లు చాలడం లేదు. ఎంతోకాలంగా ఎన్టీఆర్- బాలకృష్ణను పక్కపక్కన చూడాలని వాళ్లు కోరుకుంటున్నారు.
ఇన్నాళ్లకు ఆ కల నెరవేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతే ఆడిటోరియం మొత్తం చప్పట్లు, ఈలలు, కేకలతో మారుమోగిపోయింది. అభిమానులే ఈ స్థాయిలో ఎమోషన్ ఫీలైతే.. మరి స్టేజ్ మీద, తనకు ఎంతో ఇష్టమైన బాబాయ్ బాలయ్య పక్కనే వున్న ఎన్టీఆర్ ఎలా ఫీలవ్వాలి.ఎంతో కాలంగా నందమూరి కుటుంబం, బాబాయ్ ఆదరణ కోసం ఎదురు చూస్తోన్న ఎన్టీఆర్ కళ్లు చెమ్మగిల్లాయి. అటు బాలకృష్ణ కూడా ఉద్వేగానికి గురయ్యారు.
ఎన్టీఆర్ వెంటనే తేరుకొని అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మా బాబాయ్ బాలకృష్ణ కింగ్ అని చెప్పారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం తాతయ్య నందమూరి తారకరామారావు, మా నాన్న హరికృష్ణ, మా బాబాయ్ బాలకృష్ణ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎన్టీఆర్‌తో అభిమానంగా బాలకృష్ణ మాట్లాడడం చూసి అక్కడికి వచ్చిన ఎంతో మంది సినీ పెద్దలు కూడా ఎంతగానో సంతోషించారు.